గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.50 పెంచి పేదలపై భారం వేస్తున్న మోదీ సర్కారు తీరును మహిళలు ఎండగట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. శుక్రవారం పలు జిల్లాల్లో ఆందోళనలు హోరెత్తాయి. ఖాళీ సిలిండర్లు, కట్టెల మోపులు నిరసనల్లో భాగమయ్యాయి. ఈ ప్రదర్శనల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, రహదారులపై వంటావార్పు చేపట్టాయి. ‘మోదీ హఠావో.. దేశ్ కో బచావో’ అంటూ నినదించారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. బీజేపీ ప్రభుత్వం మోపుతున్న భారాలపై మహిళల్లో పెల్లుబికుతున్న ఆగ్రహానికి ఈ ధర్నా అద్దం పట్టింది.
న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ: కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఉమ్మడి పది జిల్లాల్లో పార్టీ శ్రే ణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. మోదీ డౌన్.. డౌన్.. బీజేపీకో హటావ్..దేశ్‌కీ బచావ్ అంటూ మహిళలు ముఖ్యకూడళ్లలో నినాదాలతో హోరెత్తించారు. గ్యాస్ సిలిండర్, కట్టెల మోపులతో వినూత్న నిరసనలు చేపట్టారు. రోడ్లపై కట్టెలపొయ్యి పెట్టి వంటావార్పు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నా లు, రాస్తారోకోలు, ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనాలు, కట్టెల పొయ్యిలపై వంటలతో నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, ఖాళీ సిలిండర్లు ప్రదర్శించారు. సికింద్రాబాద్ జూ బ్లీబస్టాండ్ చౌరస్తాలో చేపట్టిన నిరసనలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా..
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మహాధర్నాలు జరిగాయి. నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మహిళలు వంటావార్పు చేశారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు నేతృత్వంలో ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. హాలియాలో సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో, దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పుతో నిరసన తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ఆధ్వర్యంలో తిరుమలగిరిలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నేరేడుచర్లలో హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో సిలిండర్లతో ధర్నా చేశారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నేతృత్వంలో నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆధ్వర్యంలో, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిరసనల హోరు
ఆదిలాబాద్‌లోని తెలంగాణచౌక్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మహిళలు నిరసన తెలిపారు. గుడిహత్నూర్ మండలంలో ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్, ఖానాపూర్‌లో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. లక్షెట్టిపేటలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, రాష్ట్ర అభివృద్ధి సంస్థ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి కార్యకర్తలతో కలిసి వంటావార్పు నిర్వహించారు.
మహబూబ్‌నగర్, ఖమ్మంలలో..
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కోస్గిలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్, నారాయణపేట, అయిజ, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్లలో ఎమ్మె ల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అబ్రహాం, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, లక్ష్మారెడ్డి, వనపర్తిలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీశ్రేణులతో కలిసి పాల్గొన్నారు. జగిత్యాల, సారంగాపూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి, గోదావరిఖనిలో కోరుకంటి చందర్, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొని నిరసన తెలిపారు. ఖమ్మంలోని ధర్నా చౌక్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. మణుగూరులో ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
హనుమకొండ చౌరస్తాలో నిర్వహించిన వంటావార్పులో చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. హసన్‌పర్తిలో వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్, పరకాలలో ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ చౌరస్తాలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి స్థానిక మహిళలతో కలిసి కట్టెలమోపుతో ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడలో ఎంపీ కవిత, డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఖాళీ సిలిండర్లతో నిరసన తెపారు.
గ్యాస్ ధరలను బేషరతుగా తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను బేషరతుగా తగ్గించాలి. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే నరేంద్ర మోదీ ప్రధాని కావడం దురదృష్టకరం. సిలిండర్ ధరలు పెంచి నిరుపేదలపై భారం మోపడం దారుణం. ఏడాదిలో మూడుసార్లు సిలిండర్ ధరలు పెరిగితే బీజేపీ నాయకులు ఒక్కరు కూడా నోరుమెదపకపోవడం విచారకరం. అదానీకి గ్యాస్ వ్యవస్థను అప్పగించే పనిలో ప్రధాని మోదీ ఉన్నారు. చిరు వ్యాపారులు, బజ్జీల బండీలు నడుపుకొనే వారికి పెరిగిన ధరలు మోయలేని భారంగా మారాయి. ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయి.
–రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
మిత్రుల కోసం పేదల కడుపు కొడుతున్నారు
దేశంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మును ఆయన దగ్గరి మిత్రులకు దోచిపెడుతున్నారు. ఆయన ఆప్త మిత్రుల కోసం పేదల కడుపు కొట్టడం అన్యాయం. ఇప్పటివరకు రూ.19 లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీ, అంబానీలకు దోచి పెట్టడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచ మారెట్లో క్రూడాయిల్ ధరలు అప్పుడు, ఇప్పుడూ 100 డాలర్లే. అలాంటప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడంలో ఆంతర్యమేమిటి. పెంచిన గ్యాస్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. తక్షణమే ఉపసంహరించుకోవాలి.
–విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సగటు మనిషిపై గ్యాస్ గుదిబండ
కేంద్ర ప్రభుత్వ విధానాలు సగటు మనిషికి చుకలు చూపిస్తున్నాయి. సగటు మనిషిపై గ్యాస్ ధరల పెంపు గుదిబండగా మారింది. ఇప్పటికే చమురు రేట్లు అమాంతం పెంచేసి, వాహన చోదకుల చేతి చమురు వదిలిస్తున్న కేంద్రం.. మళ్లీ గ్యాస్ ధరలను పెంచడం దారుణం. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి.
– తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి