Minister Jagadish Reddy | కొందరు ఏసీ గదుల్లో కూర్చొని అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారని, అభివృద్ధి ఎక్కడ జరిగిందో సంక్షేమ పథకాలు ఎక్కడ అమలవుతున్నాయో అక్కడే దశాబ్ది ఉత్సవాలను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్రత మండపంలో తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందన్నారు. కరెంటు కష్టాల నుంచి బయటపడ్డామన్నారు.
మంచినీటి కష్టాలు తీరాయని, ఫ్లోరైడ్ రక్కసి సమస్య నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా బయటపడిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో గణనీయ ప్రగతిని సాధించామని, సంక్షేమ పథకాల అమలుతో బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొంటున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మికకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.