Suryapet | సమైక్య పాలకుల పాలనలో నిరాధరణకు గురైన బ్రాహ్మణులను, రైతులను గుర్తించింది సీఎం కేసీఆరేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట దురాజ్‌పల్లి సమీపంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని దేవాయదాశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. వారికోసం ఓ కేంద్రం ఏర్పాటు గోపనపల్లి తర్వాత సూర్యాపేటలోనేనన్నారు. అన్ని రంగాల మాదిరే బ్రాహ్మణ సంక్షేమంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ ఎందరో పేదలున్నారన్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించిందని.. ఇందులో భాగంగా ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’ను ఏర్పాటు కోట్లాది నిధులు కేటాయిస్తుందన్నారు. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.
పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందించబడుతుందన్నారు. పేద బ్రాహ్మణ కల్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కల్యాణ మండపంగా ఉపయోగపడుతుంది అన్నారు. ఆధ్యాత్మికతకు, వ్యవసాయానికి పుట్టినిల్లుగా ఉన్న భారతదేశంలో పాలకుల నిర్లక్ష్యంతో రైతులతో పాటు అర్చకులు సైతం వలసలు పోతున్న సందర్భంలో వారి కోసం కేసీఆర్ తెచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు పూర్వ వైభవాన్ని తెచ్చాయన్నారు.
ఆధ్యాత్మికత నిలబెట్టిన గొప్పతనం బ్రాహ్మణ సమాజానిదే అన్నారు. 2014కు ముందున్న ఆకలి కేకలతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని పారద్రోలిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఆదాయంతో పాటు, విద్యుత్ వినియోగాలనే అభివృద్ధికి గీటురాయిగా చూస్తారన్న మంత్రి, తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగాలలో దేశంలోనే తెలంగాణ నెంబర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్న మంత్రి, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. బ్రాహ్మణ సమాజమంతా విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.