నల్లగొండ, మార్చి 4: ‘నాకు భార్య లేదు.. పిల్లలు లేరు.. కుటుంబం లేదు’ అని నమ్మించి దేశ ప్రధాని అయిన మోదీ.. పేదల కడుపు కొట్టి రూ.19 లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్మును గుజరాత్‌కు చెందిన కేవలం పది మంది కార్పొరేట్లకు దోచిపెట్టారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నల్లగొండ లో టీఎన్జీవో ఉమ్మడి నల్లగొండ జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యా లెండర్‌ను మంత్రి ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ మాయాజాలం బట్టబయలైందని, ఆయన అనుచరులకు ప్రభుత్వ సొమ్ము రూ.19 లక్షల కోట్లు ధారాదత్తం చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో పేదోడిని కొట్టి పెద్దోడికి పెట్టే విధంగా ప్రధాని మోదీ చర్యలున్నాయని, తద్వారా 35 శాతం మంది పేదలు ఒక్కపూట భోజనమే చేస్తున్న దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌లోనే ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. తనకు పిల్లలు లేరని చెప్పి.. గుజరాత్‌కు చెందిన ఆ పది మంది కార్పొరేట్లే తన పిల్లలుగా భావించి వారి సంపద పెంచుతున్నారని దుయ్యబట్టా రు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని మోదీ సర్కారు.. వాటిని అమలు చేయకుండా అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ కింద రూ.26 వేల కోట్లు, రైతుబంధు పథకానికి రూ.60 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.15 వేల కోట్లు అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా మోకాలడ్డుతున్నదని మండిపడ్డారు. సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం అయితే.. బ్యాంకులను ఒకటి చెయ్యాలి, ఎల్ఐసీని, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమని ధ్వజమెత్తారు.
మోదీ పాలనలో మొదటగా నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, కేంద్ర సర్కారు చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.