చిట్యాల, మే 14 : ప్రధాని మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటు పట్ల ప్రజలు విసుగెత్తి పోతున్నారని, కన్నడ ప్రజలు అదును చూసి దెబ్బకొట్టారని తెలిపారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. 9 రాష్ర్టాల్లో అనైతికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర మోదీదని విమర్శించారు.
ప్రజల తీర్పును లెక్క చేయకుండా అప్రజాస్వామిక పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. దీంతో విసుగెత్తిన కన్నడ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, తిరుగుబాటు ఎలా ఉంటుందో మోదీకి రుచి చూపించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు యావత్ భారతావని సన్నద్ధం అవుతున్నదని పేర్కొన్నారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు స్థితిలో ఉన్నదని, ప్రజలు అధికారం అప్పగించినా నిలబెట్టుకునే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. మోదీపై రోజురోజుకూ విశ్వాసం సన్నగిల్లుతున్నదని, హామీలను అమలు చేయకపోతే ఏమవుతుందో కన్నడ ప్రజలు చూపించారని అన్నారు. ఈ తీర్పు దేశానికి మంచి పరిణామమని, అందరూ స్వాగతించాలని మంత్రి పేర్కొన్నారు.