ఖమ్మం, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకబోతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాయమాటలతో కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
యూపీఏ ప్రభుత్వం విఫలమైందనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీకి అవకాశమిస్తే.. ఎనిమిదేండ్లుగా కుల, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను మించి ప్రజలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ ద్రోహపూరిత వైఖరిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశ ప్రజలందరినీ ఐక్యంచేయడానికి నడుంబిగించారని చెప్పారు.