నిర్మల్ అర్బన్, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు నిరంతరాయంగా కొనసాగాలని, రాష్ర్టాభివృద్ధికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిర్మల్‌లోని గండిరామన్న దత్తసాయి క్షేత్రం నుంచి దిలావర్పూర్ మండలం కదిలి మహా పాపహరేశ్వర ఆలయం వరకు సాయిదీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహాపాదయాత్ర నిర్వహించారు. ఇందులో మంత్రి అల్లోల పాల్గొని వారితో కలిసి నడిచారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం ఆరేండ్లుగా జగన్మోహన్రెడ్డి శ్రావణ మాసం చివరలో పాదయాత్ర నిర్వహిస్తున్నాడని, తాను ఈసారి పాల్గొనడం ఆ భగవంతుడి కృపగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. యువత భక్తి భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మంత్రి, భక్తులు చేపట్టిన పాదయాత్రకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంఘీభావం తెలిపారు. ప్రతి గ్రామంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.