హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సాయన్న మరణ వార్త అందరినీ కలచి వేసిందన్నారు. కంటోన్మెంట్లో ఐదుసార్లు ఎమ్మెల్యే పనిచేశారని గుర్తుచేశారు. ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడన్నారు. సాయన్న మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాని తెలిపారు.
సాయన్న భౌతికకాయానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి నివాళులు అర్పించారు.
కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న (72) ఫిబ్రవరి 19న కన్నుమూశారు. ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్ యశోద దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1.45 గంటలకు మరణించినట్టు వైద్యులు తెలిపారు. సోమవారం మ ధ్యాహ్నం 2 గంటలకు మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనున్నారు.
సాయన్న 1951 మార్చి 5న జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సాయన్న బీఎస్సీ, ఎల్ఎల్బీ చదివారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన సాయన్న 2009లో ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన సాయన్న 2018 ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. హుడా డైరెక్టర్గా ఆరుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. వీధి బాలలకు పునరావాసంపై ఏర్పాటైన హౌస్ కమిటీ చైర్మన్గా పనిచేశారు.