Minister Indrakaran Reddy | నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50కోట్ల యూఎఫ్ఐడీసీ నిధులు విడుదల చేసిందని, ఈ నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణానికి రూ.50కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అడిగిన వెంటనే నిర్మల్ అభివృద్ధికి రూ.50కోట్ల నిధులను కేటాయించారన్నారు. పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక నిధులు అభివృద్ధికి ఎంతో ఊతమిస్తాయని, సమగ్ర ప్రణాళికతో నిధులను సద్వినియోగం చేసుకుంటామన్నారు. నిధులతో ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించడంతో పాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రతి వార్డుకు సీసీ రోడ్డు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిధులతో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామని వివరించారు. ఈ సీసీ రోడ్లు, డ్రైన్లు, రూ.5 కోట్లతో నూతన పురపాలక భవన నిర్మాణం, రూ.4కోట్లతో ఎన్టీఆర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం అండ్ మల్టిపర్పస్ హాల్, రూ.2 కోట్లతో ధర్మసాగర్ చెరువు వద్ద మురుగు నీటి శుద్ధీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం, కూడళ్ల అభివృద్ధి, సైక్లింగ్ ట్రాక్, సామాజిక భవనాలు, స్మశాన వాటికలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.