హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మరాఠ్వాడాలో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయం సా ధించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. మరాఠ్వాడా ప్రాంతంలోని కిన్వట్ తాలూకా దయాళ్ ధనోరా గ్రామంలో శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాంరావ్ బాపూ మహరాజ్ విగ్ర హ ప్రతిష్ఠ మహోత్సవంతో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని కోరారు. మహారాష్ట్రలో కోఆర్డినేటర్లను నియమించి పార్టీ విస్తరణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమ రాష్ట్రంలో కూడా అమలుచేయాలని మహారాష్ట్ర సహా అనేక రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాంరావ్ బాపూ గిరిజనుల ఐక్యత కోసం అహర్నిశలు కృషిచేశారని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పీఠాధిపతిగా ధర్మపరిరక్షణ, బంజారాల శ్రేయస్సు కోసం విశేష సేవలు అందించారని తెలిపారు.
సీఎం కేసీఆర్ దశలవారీగా రాష్ట్రంలో ని ప్రధాన ఆలయాల అభివృద్ధికి కృషి చే స్తున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సంకటహరణ హనుమాన్ ఆలయాన్ని ఆయన శనివారం దర్శించుకొని పూజలు చేశారు. నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం నేడు ప్ర పంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. ప్రతిపాదనలు తెప్పించుకొని దశలవారీగా ఆలయాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు వివరించారు. పుప్పాలగూడ హనుమాన్ ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.