Minister Indrakaran Reddy | సీఎం కేసీఆర్ నాయకత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలకు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ అర్చక ఉద్యోగులకు అత్యుత్తమైన వేతనం వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రూ.1400 కోట్లు వెచ్చించి యాదాద్రి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా మార్చిన ఘనత సీఎందే అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణుల పిల్లలకు రూ.20లక్షల చొప్పున ఆర్థిక సాయం, బ్రాహ్మణుల గౌరవవేతనాలు పెంచడం బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి కేసీఆర్కున్న ప్రేమకు నిదర్శనం అన్నారు. దేశంలోనే తొలి బ్రాహ్మణ సదన్ భవన్ గోపనపల్లిలో నిర్మితమవగా.. ఆ తర్వాత స్థానం సూర్యాపేటకు దక్కిందన్నారు.
భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రాహ్మణ సమాజం అండగా నిలబడి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగ యాదవ్, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, బ్రాహ్మణ పరిషత్ సభ్యులు సముద్రాల వేణుగోపాల చారి, బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.