Kotha Prabhakar reddy | నిర్మల్, అక్టోబర్ 31: కత్తిపోటు గాయంతో క్రిటికల్ కండిన్లో దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar reddy ) హస్పిటల్ చికిత్స తీసుకుంటుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నాడని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ( Minister Indrakaran Reddy ) ఫైర్ అయ్యారు. ఒక పక్కన ప్రభాకర్‌రెడ్డి చావుబతుకుల్లో ఉంటే కోడికత్తి డ్రామా అని రేవంత్ రెడ్డి..అమనవీయ వ్యాఖ్యలు చేస్తున్నాడని రేవంత్ తీరుపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి కుట్రలు, కుతంత్రాలు కొత్త కావని, అనాది నుంచి హత్యా రాజకీయాల చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి, ఎన్నికల్లో ఓటమి ఖాయమని భావించి రేవంత్ రెడ్డి హింస రాజకీయాలకు దిగుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలో హింస రాజకీయాలకు తావులేదని, గత పదేళ్ల నుంచి తెలంగాణ ప్రశాంతంగా ఉందన్నారు. అలాంటి తెలంగాణలో మళ్లీ చిచ్చు పెట్టేందుకు పన్నాగం పన్నుతున్నారని ధ్వజమెత్తారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కాలకూట విషం లాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చుపెట్టే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.