హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో న్యాయశాఖ పద్దులను మంత్రి పద్దులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు పారదర్శకమైన, ఖచ్చితమైన, సత్వర న్యాయం అందించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో న్యాయశాఖ నిబద్ధతతో పని చేస్తుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం, హైకోర్టు విభజన తర్వాత రాష్ట్రంలో కొత్త కోర్టు ఏర్పాటుతో పాటు కోర్టు భవనాల్లో మౌలిక వసతుల కల్పన, పోస్టుల మంజూరుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. న్యాయస్థానంలో సాంకేతిక పద్ధతిపై సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం తమ వంతు సహకారాన్ని అందిస్తుందన్నారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నామని సభా ముఖం తెలియజేసేందుకు సంతోషిస్తున్నానన్నారు. రాయదుర్గంలో 3.7 ఎకరాల స్థలంలో ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్‌కు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఐఏఎంసీ అందుబాటులోకి రావడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు ఇక్కడకు వస్తాయన్నారు. అన్నిరకాల వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ హైదరాబాద్ గొప్ప కేంద్రంగా నిలుస్తుందని, ప్రపంచలోని ముఖ్యమైన ఆర్బిట్రేషన్ సెంటర్ చిత్రపటంలో మన హైదరాబాద్ చేరడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
రాష్ట్రంలో కొత్త కోర్టుల ఏర్పాటు, రెసిడెన్షియల్ క్వార్టర్స్, మౌలిక వసతులు కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. వరంగల్ పట్టణంలో నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభించామన్నారు. సికింద్రాబాద్‌లో సిటీ సివిల్ కోర్టు సముదాయంలో ఫేజ్-2 భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. నల్గొండ, ఆదిలాబాద్, బెల్లంపల్లిలోని న్యాయస్థానాల భవన నిర్మాణాలు, న్యాయమూర్తులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్, గోదావరిఖని, గద్వాల్, దేవరకొండ, నల్గొండ జిల్లా, ఎల్లారెడ్డి, కోరుట్లలో భవన నిర్మాణాలు, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.