నిర్మల్: రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీ ఇన్చార్జిగా పనిచేసిన తమిళిసై ఇక్కడ కూడా బీజేపీకి వంత పాడుతూ ఆ పార్టీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఇలాగే వ్యవహరించిన అప్పటి గవర్నర్ రామ్‌లాల్‌కు ఎదురైన పరిస్థితే తమిళిసైకి కూడా ప్రజల తిరుగుబాటు రూపంలో ఎదురవుతుందన్నారు.
ఇప్పటికైనా గవర్నర్ తన పద్ధతిని మార్చుకోవాలని ఇంద్రకరణ్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు కరెంటు కోతలు, తాగు, సాగు నీరు లేక అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పథకాలపై ఆ పార్టీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం దేశానికి ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశం కూడా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర వాసులు తమను కూడా తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.