సిద్దిపేట : తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమకాల కోసం జరిగిన చారిత్రాత్మక ఉద్యమం నుంచి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao)అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో అమరవీరుల స్తూపాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అమరుల త్యాగాలు తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకునేలా జూన్ 2న హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో ప్రారంభించనున్నామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ.10 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్ర ప్రదేశ్(andhra pradesh) లో యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా తెలంగాణ(telangana)లో యాసంగి పంట 54 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అన్నారు.
తెలంగాణవాసులు మక్క గట్క, జొన్న గట్క తినేవారనీ, అన్నం తినడం నేర్పించింది తానేనని టీడీపీ చంద్రబాబు నాయుడు(chandra babu) చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు.‘ తెలంగాణ భూమికి బరువయ్యేంత పంట పండించింది. వరినాట్లు వేసేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి వచ్చిందని ’ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకేసారి వేస్తే తమకు కార్యకర్తలు దొరకకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) అనడం ప్రతిపక్షాల మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని విమర్శించారు.
పక్క రాష్ట్ర సర్పంచులు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇవ్వండి లేదంటే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటుంటే, ఆ మాటలు ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం కనిపించదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడి బొడ్డున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద నిర్మిస్తున్న సెక్రటేరియట్ ను కూల గొడతామని ఒకరు, పేల్చేస్తామని మరో ప్రతిపక్ష నేతలు తెలంగాణలో ఉండడం దురదృష్టకరమని అన్నారు.
అధికారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉంటే రైతులకు ముక్కు పిండి కరెంట్ బిల్లు వసూలు చేసేవారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిని దేశం అనుసరిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్ , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.