సంగారెడ్డి : నారాయణ ఖేడ్ అంటేనే రాళ్లు, రప్పలు, కొండలతో నిరుపయోగంగా ఉండేది.. కానీ బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నారాయణ ఖేడ్ నియోజకవర్గం కశ్మీర్ లోయగా మారబోతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసి లక్షా 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో నారాయణ ఖేడ్ దశదిశ మారుతుందన్నారు. గతంలో వెనుకబడిన ప్రాంతంగా పేరున్న నారాయణ ఖేడ్.. నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నారాయణ ఖేడ్‌లో 70 ఏండ్లలో పరిష్కారం కానీ సమస్యలు సీఎం కేసీఆర్ చొరవతో ఏడేండ్లలో పరిష్కారం అయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను తీసుకువచ్చి సింగూర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేసి.. ఆ బ్యాక్ వాటర్ నుండి బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు. రూ. 1,074 కోట్లతో బసవేశ్వర ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు అని తెలిపారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ ఈ నెల 21న శంకుస్థాపన చేయబోతున్నారు అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.