Tollywood Censor Board | టాలీవుడ్లో ఇటీవల సెన్సార్ బోర్డు (CBFC) అనుసరిస్తున్న కఠిన వైఖరి సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా సినిమాల టైటిల్స్ విషయంలో బోర్డు సభ్యులు వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలు నిర్మాతలు, దర్శకుల్లో తీవ్ర అసంతృప్తిని నింపుతున్నాయి. గత నెల నుంచి ఈ నెలలో రాబోతున్న పలు చిత్రాల పేర్లపై సెన్సార్ అడ్డంకులు సృష్టించడంతో, మేకర్స్ చివరి నిమిషంలో టైటిల్స్ మార్చుకోవాల్సి వస్తోంది.
సుహాస్ నటించిన ‘హే భగవాన్’ చిత్రానికి ‘భగవాన్’ అనే పదం మతపరమైన భావాలను దెబ్బతీస్తుందన్న కారణంతో దానిని ‘హే బలవంత్’గా మార్చాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. అలాగే శివ కందుకూరి నటించిన ‘చాయ్ వాలా’ టైటిల్ దేశ ప్రధానిని ఉద్దేశించినట్లు ఉండవచ్చనే అనుమానంతో బోర్డు అభ్యంతరం తెలపడంతో, మేకర్స్ ఆ పేరును ‘నవాబ్ కేఫ్’గా మార్చారు. అలాగే గత నెలలో ‘వానర’ అనే చిత్రాన్ని సైతం ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇవే కాకుండా శ్రీ చిదంబరం చిత్రాన్ని శ్రీ చిదంబరం గారు అని టైటిల్ మార్చాల్సి వచ్చింది.
మరోవైపు సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు అయితే ఏకంగా ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్ మార్చితే తప్ప ‘యు/ఏ’ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు తెగేసి చెప్పడంతో, నిర్మాతలు తప్పనిసరి పరిస్థితుల్లో అదే సర్టిఫికేట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లారు. అలాగే ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు మరియు పోస్టర్ల ద్వారా భారీగా ప్రచారం చేసుకున్న తర్వాత ఇలా టైటిల్స్ మార్చడం వల్ల బ్రాండింగ్ దెబ్బతినడమే కాకుండా, ప్రచార ఖర్చు అంతా వృథా అవుతోందని కొందరూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అసభ్యత లేకపోయినా, ఎవరినీ కించపరచకపోయినా సెన్సార్ బోర్డు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు లేని నిబంధనలు చిన్న సినిమాలపైనే రుద్దుతున్నారనే విమర్శలు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్నాయి.