Kaleshwaram | సిద్దిపేట, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాం గ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న దుష్ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయిందని, ఇందుకు గోదావరి జలాలలతో నిండిన మల్లన్నసాగర్ రిజర్వాయరే నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. భారీ వరదలనే కాదు, బురద రాజకీయాలను కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకొని నిలబడిందని చెప్పారు.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి తొలిసారిగా 21 టీఎంసీల గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రాజెక్టును ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, వెంకట్రామిరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మల్లన్నసాగర్‌ను సందర్శించారు.
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడు తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే మల్లన్నసాగర్లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఎల్లంపల్లి, లక్ష్మీబరాజ్, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ వరకు ఇవ్వాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భగంగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు. నిండుకుండలా ఉన్న మల్లన్నసాగర్.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తోపాటు కాల్వలను కూడా 90% మేర బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా 10% పనులైన పిల్ల కాల్వలు, పంట కాల్వలను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మూర్ఖపు మాటలు మానుకోవాలి
కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయిందన్న మూర్ఖపు మాటలను కాంగ్రెస్ నేతలు ఇకనైనా మానుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. కేసీఆర్ కట్టించిన అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని వివరించారు. అన్నపూర్ణలో 3 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 3 టీఎంసీలు, మల్లన్నసాగర్లో 21 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్‌లో 10 టీఎంసీల నీళ్లు నింపుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్‌ది డైవర్షన్ పాలిటిక్స్ అయితే, బీఆర్ఎస్ది వాటర్ డైవర్షన్ అని చెప్పారు.
బీఆర్ఎస్ది పంటలు పండించే రాజకీయమైతే.. కాంగ్రెస్‌ది రాజకీయ మంటలు మండించే రాజకీయం అని ఎద్దేవా చేశారు. ‘నాడు మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డంపడ్డారు.. కోర్టుల్లో కేసులు వేసిండ్రు.. ఇవ్వాళ సంతోషాన్ని పంచుకుందామని వస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నరు. కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులో 21 టీఎంసీల నీళ్లు వచ్చాయనే సంతోషంతో పసుపు కుంకుమ వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని వచ్చాం.
దీనిని కూడా అడ్డుకుంటారా? ఈ నీళ్లతో మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పంటలు పండటం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదా?’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్‌కు వచ్చి పసుపు కుంకుమ వేసి కొబ్బరి కాయకొడితే వారి పాపాలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు.
పోలీసుల అత్యుత్సాహం
మల్లన్నసాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు బృందంతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. వారిని మల్లన్నసాగర్ బండ్ మీదికి రానియ్యకుండా అడ్డంకులు సృష్టించారు. పంపులు పోసే వరకు పోయిన బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకదశలో బీఆర్ఎస్ కార్యకర్తలపై, కొంతమంది మీడియా ప్రతినిధులపై గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి రాయలేని భాషలో దుర్భాషలాడారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కార్యకర్తల గల్లా పట్టుకొని చేయి చేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన మరో కార్యకర్తతో కూడా దురుసుగా మాట్లాడారు.
దీనిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా చిటపటలాడారు. ఏసీపీతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ‘అట్లా మాట్లాడొద్దు సార్’ అంటూ తోటి సీఐలు చెప్పేందుకు ప్రయత్నించినా ఏసీపీ వినలేదు. బీఆర్ఎస్ బృందం వెళ్లేప్పుడు మల్లన్నసాగర్ కట్టపై ట్రాఫిక్‌ను కూడా క్లియర్ చేయలేదు. పోలీసులు చూస్తూ ఉండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలే ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే దిక్కు
‘హైదరాబాద్‌కు మంచినీళ్లు తీసుకపోతా, మూసీకి నీళ్లు తీసుకపోతా అని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. సంతోషమే.. కానీ, అదెట్లా సాధ్యమైంది? దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టే కదా దిక్కు.. హైదరాబాద్‌కు నీళ్లు తీసుకపోవాలంటే మల్లన్నసాగరే కదా దిక్కు’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి జిల్లాను సస్యశ్యామలం చేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు వృధా అయ్యాయని, కాళేశ్వరం కొట్టుకుపోయిందని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. వెంటనే అన్ని చెరువుల్లో, రిజర్వాయర్లలో చేపపిల్లలను వేయాలని డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ కల ఫలించింది. మల్లన్నసాగర్‌కు తొలిసారిగా 21 టీఎంసీల నీళ్లు వచ్చాయి.. సముద్రాన్ని తలిపించేలా నిండుకుండలా, కన్నులపండువగా ఉన్నది. ఇవ్వాళ చాలా సంతోషంగా ఉన్నది. యాసంగి పంటకు ఢోకాలేదు. నాలుగు జిల్లాలకు అద్భుతంగా నీళ్లు రాబోతున్నాయి. చెరువుల్లో నీళ్లు నిండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుఉంటది. ప్రతి రైతు గుండెలో కేసీఆర్ నిలబడి ఉంటడు.’
-మాజీ మంత్రి హరీశ్‌రావు