సంగారెడ్డి : రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీ వాసులకు మంత్రి హరీశ్‌రావు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీ వాసులకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆ నాడు పట్టాలు ఇస్తామని హమీ ఇవ్వడానికి భయపడ్డాను. కానీ దేవుడి దయ, కేసీఆర్ ఆశీస్సులతో పట్టాలు ఇవ్వడం సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. పేదలకు పట్టాలు ఇచ్చి హక్కు దారులను చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఇక ఫెన్సింగ్ కాలనీ వాసులు భయపడే పరిస్థితి లేదు… మీ భూమికి మీరే హక్కు దారులు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
మరో 218 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇప్పిస్తామని హామీనిచ్చారు. జీవో 58, 59 ద్వారా పఠాన్ చెరు నియోజకవర్గంలో 5 వేల మందికి ఇప్పటికే పట్టాలిచ్చామని గుర్తు చేశారు. మరో మారు ఈ జీవో ద్వారా పట్టాలు ఇచ్చే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. మార్చి 31 వరకు గడువు ఇవ్వడం జరిగింది. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి అని హరీశ్‌రావు సూచించారు.