హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ముంపు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నది. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల పట్ల విస్తృతంగా ప్రచారం చేస్తూ, అవగాహన కల్పిస్తున్నది. వరదలతో ప్రభావితమైన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో ఆదివారం 289 శిబిరాలను ఏర్పాటుచేశారు. రెండు రోజుల్లో మొత్తం 24,674 మందికి పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వైద్యసిబ్బందిలో ఉత్సాహం పెంచేలా అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ‘సీఎం కేసీఆర్ సూచన మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం. తగినన్ని ఔషధాలు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాం. కీటక జనిత రోగాలు, కలుషిత నీరు, ఆహారం ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు’ అని మంత్రి ట్వీట్ చేశారు. హెల్త్ క్యాంపుల ఫొటోలను జతచేశారు. వరదను సైతం లెక్క చేయకుండా ఆరోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. జ్వర బాధితులకు పరీక్షలు నిర్వహిస్తూ, ఔషధాలు అందజేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన నోడల్ ఆఫీసర్లు డీపీహెచ్ శ్రీనివాసరావు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించగా, డీఎంఈ రమేశ్‌రెడ్డి మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాల్లో హెల్ప్లైన్లు
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వ్యాధులు విజృం భించకుండా ఎక్కడికక్కడ హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రస్థాయిలో 9030227324, 040-24651119 నంబర్లను కేటాయించింది. అన్ని జిల్లాల్లో డివిజనల్, జిల్లా స్థాయిల్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పింది.