హైదరాబాద్ : నరగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహారం అందుబాటులోనే ఉన్నాయా? అని ఆరా తీశారు. అన్నీ సక్రమంగా అందుతున్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖానాలో రోగులు, అటెండెంట్లకు అందిస్తున్న ఆహారంపై మంత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
డైట్ చార్జీలు పెంచి చక్కటి పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. రోగులకే కాకుండా హైదరాబాద్ పరిధిలో 18 ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5 చక్కటి భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని, దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలు, బ్లడ్, ఆక్సిజన్ వంటి అత్యవసర సదుపాయాలు దవాఖానాలో ఉన్నాయో లేవో పరిశీలించారు. అత్యవసర మందులు, బ్లడ్ కోసం రోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపొద్దని 24 గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు.
కావాల్సిన మందులు ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని సూచించారు. ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు కావాలో రోగులను అడిగి తెలుసుకుని, వాటిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని, నిధులకు వెనకాడకుండా అన్ని ఆధునిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పారిశుధ్య నిర్వహణలో అలక్ష్యం వద్దని, ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణకు అయ్యే చార్జీలను పెంచిందని, కాబట్టి పారిశుధ్య నిర్వహణ చక్కగా ఉండాలని ఆదేశించారు.