Minister Harish Rao | మెదక్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్‌కు లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు, మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం చెక్కులను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. అనంతరం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియా, గాంధీ భవన్, బీజేపీ భవన్లో తప్ప ప్రజల్లో ఆ పార్టీలు లేవని పేర్కొన్నారు. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను స్వీకరిస్తున్నదని, రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నదని తెలిపారు. ఫీజుల రూపంలో అభ్యర్థులను అమ్ముతున్నారని, అలాంటి కాంగ్రెస్ వస్తే రాష్ర్టాన్ని కూడా అమ్ముతుందని అన్నారు.
కర్ణాటకలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటకలో రైతులు, కరెంటు పరిస్థితిపై అక్కడి ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడంలో బిజీగా ఉంటే కేసీఆర్ మాత్రం పుట్లకొద్దీ వడ్లు పండించడంలో నిమగ్నమయ్యారని తెలిపారు. ‘కాంగ్రెస్, బీజేపీలది అధికార యావ.. బీఆర్ఎస్ పార్టీది ప్రజా సంక్షేమ యావ’ అని స్పష్టం చేశారు. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకువస్తే ఎవరూ నమ్మలేదని, కానీ, సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేసి చూపించారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరించామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని వెల్లడించారు. నాలుగు లక్షల ఎకరాల్లో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి రైతు బీమాను అమలు చేస్తున్నట్టు తెలిపారు. పోడు పట్టాలతో 1.50 లక్షల కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. ఇప్పటికే రైతులకు రూ. 99,999లోపు పంట రుణాలు మాఫీ చేశామని, లక్ష ఆపైన ఉన్న రుణాల మాఫీ త్వరలో పూర్తి చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అకౌంట్ పనిచేయకుంటే వారి అకౌంట్ ఆపరేషన్ స్టేటస్ చూసి మాఫీ జరిగేలా చేస్తామని భరోసా ఇచ్చారు.
ఒకే రోజు 10 వేల మంది మైనార్టీలకు సాయం
రాష్ట్రంలో పేద ముస్లిం మైనార్టీలకు రూ.లక్ష ఆర్థి క సాయం అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముస్ల్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లక్ష మంది మైనార్టీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని, శనివారం ఒక్క రోజే 10వేల మంది మైనార్టీలకు రూ.100 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమానికి ఏడాది రూ.300 కోట్లు కూడా ఖర్చు చేసేవి కాదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రూ.10 వేల కోట్లతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గంగా జమున తెహజీబ్‌కు తెలంగాణ ప్రతిరూపం అని, ఈ ఖ్యాతిని నిలబెట్టేలా ముస్లింల సంప్రదాయాలు, విశ్వాసాలు గౌరవిసూ ్తరంజాన్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఏటా రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో దావత్ ఇఫ్తార్ నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు.
పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బట్టలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. షాదీ ముబారక్ ద్వారా 9 ఏండ్లలో 2,55,518 మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ. 2,130 కోట్లు ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 12 ఉంటే, వాటిలో 5,760 మంది విద్యార్థులు విద్యనభ్యసించేవారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 204 స్కూళ్లు ఏర్పాటు చేసి 97వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. గతంలో మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు కేవలం 2 మాత్రమే ఉండేవని, వాటిలో విద్యార్థుల సంఖ్య 320 మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పుడు 204 కళాశాలల్లో 32,640 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.
పిల్లల విదేశీ విద్య కోసం రూ.20 లక్షల గ్రాంట్ ఇస్తున్నదని, 2023 మే నాటికి 2,751 మంది విద్యార్ధులకు వారి విదేశీ విద్య కోసం రూ.438 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. మైనార్టీ పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో ఏటా 100 మంది విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ ఇస్తుండడంతో 700 మంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీల సంఖ్య కోటిన్నర జనాభా ఉన్న మహారాష్ట్రలో బడ్జెట్లో రూ.674 కోట్లు కేటాయిస్తే, 50 లక్షల జనాభా ఉన్న తెలంగాణలో రూ.2,200 కోట్లు కేటాయించామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 4 కోట్ల జనాభాకు రూ.1,782 కోట్లు, కర్ణాటకలో 90 లక్షల జనాభాకు రూ.2,100 కోట్లు మాత్రమే కేటాయించారని వివరించారు.
అభివృద్ధి చూసి ‘హస్తం’ ఆగం!
రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ బేజారవుతున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓ ఎజెండాఅనేదే లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థులు, యువకుల దగ్గరకు ఆ పార్టీ వెళ్దామంటే వారు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారని, మహిళల దగ్గరకు వెళ్దామంటే కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి వాహనాలు, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు.. ఇలా అనేక సంక్షేమ పథకాలతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారని పేర్కొన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించేవాళ్లు కాంగ్రెస్ నాయకులు అని, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండేవాళ్లు బీఆర్ఎస్ నాయకులని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తిట్లు తిట్టడంలో పోటీ పడితే.. బీఆర్ఎస్ పార్టీ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు పోటీ పడుతున్నదని తెలిపారు. వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు ఇలా అనేక రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రగామిగా ఉంచేందుకు శ్రమిస్తునట్టు చెప్పారు. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని, వారు ఎల్లప్పుడూ అభివృద్ధినే కోరుకొంటారని పేర్కొన్నారు. ప్రధానిగా, మెదక్ ఎంపీగా ఉండి కూడా ఇందిరాగాంధీ మెదక్ జిల్లా ఏర్పాటు చేయలేకపోయారని, కానీ, ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల కలలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని గుర్తుచేశారు. ‘ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి’ అనే కాన్సెప్ట్‌తో బీఆర్ఎస్ ముందుకెళ్తున్నట్టు చెప్పారు.