సంగారెడ్డి, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): 20 ఏండ్ల భూసమస్యకు పరిష్కారం లభించింది. 146 మంది రైతుల కల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాకారం కావడంతో సంబురాలు జరుపుకొంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామంలోని సర్వే నంబర్లు 42, 89, 56, 101, 106లో సాగు చేసుకుంటున్న 146 మంది రైతులు 216.20 ఎకరాల భూమిపై హక్కుల కోసం 20 ఏండ్లకుపైగా పోరాటం చేస్తున్నారు. సాగులో ఉన్నవి అటవీ భూములుగా ఆ శాఖ పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకాల జారీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నది. మరోవైపు అవి అసైన్డ్ భూములు కావడంతో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడంలో రెవెన్యూ శాఖ కూడా సమస్యలు ఎదుర్కొన్నది. తమ భూ సమస్యను పరిష్కరించి పట్టాలు ఇప్పించాలని రైతులు అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ధరణి తీసుకురావడంతో తమకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వస్తాయని రైతుల్లో నమ్మకం కలిగింది. తమకు పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని, రైతుబంధు, రైతుబీమా వస్తలేదని రైతులు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శరత్‌ను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు బిడకన్నె గ్రామంలో మకాం వేశారు. వారం రోజులుగా సర్వే నిర్వహించి భూ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ధరణిలో జీఎల్ఎం (గ్రివెన్స్ ల్యాండ్ మాటర్న్) ఆప్షన్ ఇవ్వడంతో కలెక్టర్ శరత్ గ్రామంలో ప్రత్యేకంగా ఓ మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. 146 మంది రైతులకు సంబంధించి జీఎల్ఎం కింద దరఖాస్తు చేయించి పట్టాదారు పాసుపుస్తకాల జారీకి మార్గం సుగమం చేశారు. 20 ఏండ్లకుపైగా పూర్తికాని భూ సమస్యను సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించింది.
మంగళవారం మంత్రి హరీశ్‌రావు 146 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులు, బిడకన్నె గ్రామస్థులు హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండిపై మంత్రిని ఊరేగించి సన్మానించారు. పట్టాలు అందజేసిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్ల బిడకన్నె గ్రామ రైతుల భూ సమస్య పరిష్కారమైందని చెప్పారు. పైసా ఖర్చులేకుండా గ్రామంలోనే మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి భూ సమస్య పరిష్కరించినట్టు తెలిపారు. ధరణి వల్ల 146 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయని అన్నారు. బుధవారం నుంచి ఈ రైతులకు రైతుబంధు డబ్బులు పడటంతోపాటు రైతు బీమా వర్తించనున్నట్టు తెలిపారు.