మారేడ్‌పల్లి, అక్టోబర్ 31: కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ ఘటనను ఆయా పార్టీల నాయకులు ఖండిచాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా కోడి కత్తి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ రాజకీయాలను ఆపహాస్యం చేస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం హరీశ్‌రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి త్వరలో తప్పక గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నా ఏ రోజూ పగతో ఇలాంటి రాజకీయాలను చేయలేదని, సీఎం కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం ఎప్పుడు లేదని వెల్లడించారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌసింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వారు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఏదో రకమైన అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలే తప్ప.. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డితో కొద్ది సేపు మాట్లాడి ధైర్యం చెప్పానని వెల్లడించారు. కత్తితో దాడి చేయడంతో 3 ఇంచులు కత్తి పొట్ట లోపలికి వెళ్లగా, 4 చోట్ల చిన్న పేగుకు గాయమైందని, 10 ఇంచుల చిన్న పేగును తొలగించి, 15 ఇంచుల పొట్టను కట్ చేసి మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పారు.