సిద్దిపేట అర్బన్, యాదాద్రి, ఫిబ్రవరి 3: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. మరి ప్రైవేట్ కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయా? అన్ని పీఎస్‌యూలు అదానీ, అంబానీలకు పోతే వాళ్లు రిజర్వేషన్లు ఇస్తారా? ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు సంక్రమించేందుకే రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు’ అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. గురువారం సీఎం కేసీఆర్ స్వగ్రామం, సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో డబుల్ బెడ్రూం ఇండ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి, యాదగిరిగుట్టలో జరిగిన టీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే తానే కాలపెడ్తానని ఒక సందర్భంలో రాజ్యసభలో అంబేద్కర్ అన్నారని గుర్తుచేశారు. పులుల నుంచి మేకలను కాపాడాలని అంబేద్కర్ చెప్పారని.. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించేందుకే సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగ ప్రతిపాదన తెచ్చారని చెప్పారు. దేశంలో 40 కోట్ల మంది దళితులు ఉంటే కేంద్ర బడ్జెట్లో కేవలం 12,800 కోట్లు కేటాయించటం సరికాదన్నారు. కోతలు, వాతలు తప్ప దేశ ప్రజలకు బీజేపీ చేసిందేమి లేదని మండిపడ్డారు. బడ్జెట్లో ఎఫ్ఆర్బీఎం పరిమితి తగ్గించి జీఎస్డీపీలో 4 శాతం రుణాన్ని 3.5 శాతానికి తగ్గించిందని చెప్పారు. ఆ అర శాతం తగ్గించి తెలంగాణకు రావాల్సిన రూ.5 వేల కోట్లు ఇవ్వకుండా, బాయికాడ మీటర్లు పెడితేనే ఇస్తామని కేంద్రం మెలిక పెడుతున్నదని తెలిపారు. గొంతులో ప్రాణం ఉండగా బాయిల కాడ మీటర్లు పెట్టనియ్యనని సీఎం కేసీఆర్ చెప్పారని.. ఆ మీటర్లు వద్దు.. బీజేపీ వద్దు.. మన కేసీఆరే మనకు ముద్దు అని వ్యాఖ్యానించారు. బట్టేబాజ్, జూటేబాజ్ పార్టీ బీజేపీ సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
వీళ్లెందుకు మాట్లాడరు?
కేంద్రం బడ్జెట్లో రాష్ర్టానికి రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులపై ఇక్కడి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. బడ్జెట్లో ఉపాధిహామీ పథకానికి రూ. 25 వేల కోట్ల కోత విధించారని మండిపడ్డారు. ‘కేంద్ర బడ్జెట్లో మన ఐటీఐఆర్ గురించి చెప్పలేదు. రైల్వే లైన్లకు కేటాయించింది శూన్యం. నడిచే పనులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కొత్తవాటి ఊసే లేదు. రాష్ట్రంపై కేంద్రానిది చిన్నచూపే’ అని విమర్శించారు.
బండి సంజయ్ ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలి
‘కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే వాటిని నింపాలి. హైదరాబాద్ గల్లీల్లో మిలియన్ మార్చ్ అంటున్నావ్.. నువ్వు చేయాల్సింది మిలియన్ మార్చ్ కాదు, ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయాలి. దానికి మా మద్దతు ఉంటుంది’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే 50 నుంచి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చింతమడకలో 164 డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశం
సీఎం కేసీఆర్ స్వగ్రామం, సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలోని ఎస్సీ కాలనీలో పేదల కోసం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. గురువారం 164 కుటుంబాలు సామూహిక గృహప్రవేశం చేశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. ఈరోజు చింతమడక గ్రామస్థులంతా ఎంత సంతోషంగా ఉన్నారో, సీఎం కేసీఆర్ కూడా అంతే సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.