Minister Harish Rao | సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోగా రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో రైతువేదిక, బుడగ జంగాల కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనం, మహిళా మండలి భవన్, మురికి కాలువల నిర్మాణ పనులకు జడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పీఏసీఎస్ చైర్మన్ ముల్కల కనకరాజు పొలంలో నాలుగెకరాల ఆయిల్ పామ్ సాగు కోసం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఇతోధికంగా గ్రామ వీఓఏలు రూ.1016 విరాళంగా అందించారు. మహిళలకు మంత్రి స్త్రీనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నాడు తెలంగాణలో కైకిలి దొరకని పరిస్థితి ఉందని, నేడు తెలంగాణలో కైకిలోళ్లు దొరకని పరిస్థితి నెలకొన్నదన్నారు. బాయికాడ మీటర్లు పెడుతామని బీజేపీ, మూడుగంటల కరెంటు చాలని కాంగ్రెస్ చెబుతుంటే మీకు వెన్నంటే నేనున్నానని ధైర్యంగా మూడు పంటలు పండించాలని రైతులకు సీఎం కేసీఆర్ ధీమా ఇస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుకు ఎలాంటి తిప్పలు లేవని, కేసీఆర్‌తో ప్రతీ రైతుకు భరోసా దొరికిందన్నారు. కష్టపడి కాళేశ్వరం కట్టి కాల్వ తీస్తే ఇబ్రహీంనగర్ పెద్ద చెరువు నిండిందన్నారు. 30ఏళ్ల నుంచి చెరువునిండగా చూడని మీరు.. ఇగ బతికున్నంత కాలం ఎండిపోవడం చూడరని స్పష్టం చేశారు. ఇబ్రహీంనగర్-మందపల్లి పెద్దవాగుపై 6 వరకూ చెక్ డ్యామ్‌లు నిర్మించుకోవడంతో ఏటా పదిసార్లు చెక్ డ్యాములు పొంగుతున్నాయని ఇదే మనం సాధించిన గొప్పమార్పుగా చెప్పుకొచ్చారు.
ఇబ్రహీంనగర్‌లో గతేడాది వానాకాలం1682 ఎకరాలు, ఈ యాసంగిలో 1890 ఎకరాల వరినాట్లు వేశారని, గ్రామంలో 15 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా అందించినట్లు చెప్పారు. ఢిల్లీ నగరం, ఇతర రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సేనన్నారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం మారిందని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పండించిన బియ్యం కావాలని కోరుతున్నారని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు విరివిగా చేసేందుకు రైతులు ముందుకొస్తే ప్రభుత్వం తరఫున సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఎక్కడికెళ్లినా సిద్దిపేట అంటే మీ గౌరవం, ప్రతిష్ట పెంచానని.. ఈ గౌరవం, ప్రతిష్ట మీరిచ్చిందేనని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీదేనన్నారు. ఎన్నికలంటే ఐదేళ్లకోసారి వచ్చే వాళ్ల మోజు, మాయలో పడొద్దని, కష్టాల్లో ఎప్పుడూ మీ వెంట ఉంటున్న తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తనపై ఉంచిన ప్రేమ, ఆదరాభిమానాలు కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజల కోరిక మేరకు కావాల్సిన పనులు వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.