Gajwel | సిద్దిపేట : గతుకుల గజ్వేల్‌ను బతుకుల నిలయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. గజ్వేల్ అభివృద్ధి చెందిందో.. లేదో.. గుండె మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. ఎవరైనా గజ్వేల్‌కు ఏం చేశారని అడిగితే సీఎం కేసీఆర్ అన్ని చేశారని చెప్పాలన్నారు. గజ్వేల్‌కు సీఎం కేసీఆర్ రింగ్‌రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యామ్‌లను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఒకప్పుడు గజ్వేల్‌లో యాసంగిలో 7 వేల ఎకరాలు సాగు అయ్యేది.. ఇప్పుడు 17 వేల ఎకరాలను సాగు చేస్తున్నారు. 60 ఏండ్ల వెనుకకు ఉన్న గజ్వేల్‌ను 60 ఏండ్ల ముందుకు కేసీఆర్ తీసుకెళ్లారు.
తెలంగాణ రాకముందు సిద్ధిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆనాడు రైతులు, చేనేత కార్మికులు చనిపోతే పక్క రాష్టల నుండి విలేకరులు వచ్చి వార్తలు రాసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. 60 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని 6 సంవత్సరాలలో చేసి చూపాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. దేశంలో మార్పు కోసం మన కేసీఆర్ బయల్దేరారు.. మన నినాదం ఒక్కటే.. అది రైతు నినాదం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తుంది తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని చెప్పారు.