సంగారెడ్డి, అక్టోబర్ 24 నమస్తే తెలంగాణ: కేసీఆర్ తలుచుకొంటే ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను జైల్లో వేసేవారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘పక్క రాష్ర్టాల్లో చూస్తున్నాం వాళ్లు గెలువగానే వీళ్లను జైలుకు పంపిస్తారు. వీళ్లు గెలువగానే వాళ్లను జైలుకు పంపిస్తారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు’ అని అన్నారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీపై పోరాడే డీఎన్ఏ తనదని గొప్పగా చెప్పుకొనే రాహుల్‌గాంధీ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ డీఏన్ఏ ఏమిటో ముందు తెలుసుకోవాలని చురకలంటించారు. బీజేపీపై పోరాటం చేసే రాహుల్ డీఎన్ఏతో రేవంత్‌రెడ్డి డీఏన్ఏ మ్యాచ్ కావడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పదవుల కోసం ఏబీవీపీతో మొదలు పెట్టి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వరుసగా మారారని గుర్తుచేశారు.
దేశంలోకి రాజీవ్‌గాంధీ కంప్యూటర్లు తీసుకువచ్చారని గొప్పలు చెప్పుకొనే రాహుల్ గాంధీ.. కేసీఆర్ తీసుకువచ్చిన ధరణిని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల భూ రికార్డులను డిజిటలైజేషన్ చేసి ఆన్లైన్లో ఉంచామని చెప్పారు. ధరణి కారణంగా రైతులు ఇంట్లో నుంచి కదలకుండా ప్రభుత్వం అందజేసే రైతు బంధు సాయాన్ని పొందుతున్నారని చెప్పారు. అలాంటి ధరణిని వ్యతిరేకిస్తే ప్రజలు కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే మాటలు.. మూటలు… ముఠాలు.. అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పాలపిట్ట అని కొనియాడారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చూడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్‌రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత, ఇటలీ బొమ్మ అంటూ నోటికి వచ్చినట్టు తిట్టారని, కాంగ్రెస్‌లో చేరాక అదే సోనియాను దేవత అంటూ పొగడటం రేవంత్‌రెడ్డికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే రేవంత్ చేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు. నాడు ఓటుకు నోటు, నేడు నోటుకు సీటు అని కాంగ్రెస్ నాయకులే రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు సీఎం కావాలా? రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడే కేసీఆర్ సీఎం కావాలా? అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ముఖం చాటేసిన వ్యక్తి కిషన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. కేసీఆర్ చేతుల్లో ఉంటేనే రాష్ట్రం పదిలంగా ఉంటుందని చెప్పారు. ప్రజలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూలు లేవని హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. దేశం మొత్తం బొగ్గు నిల్వలు లేక కరెంటు కోతలు ఉంటే ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంటు సరఫరా అవుతున్నదని, ఇది దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. రైతులకు డబ్బులు ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రైతు వ్యవస్థ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ ధరణిని తీసుకువస్తే దానిని రద్దు చేస్తానని కాంగ్రెస్ నేతలు చెప్పటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ధరణి రద్దు చేసి తిరిగి పటేల్, పట్వారీ వ్యవస్థ తెచ్చి రైతుల ఉసురుపోసుకుంటారా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మంత్రి హరీశ్‌రావు పర్యటనలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ మంజూ శ్రీజైపాల్రెడ్డి, టీఎస్‌టీపీసీ చైర్మన్ మఠం భిక్షపతి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.