హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకెన్నాళ్లో మనుగడ సాధించే పరిస్థితి లేదని, ప్రస్తుతమున్న ఆ పార్టీ నేతలు త్వరలో గాంధీభవన్‌ను కూడా అమ్మేస్తారని పీ జనార్దన్‌రెడ్డి తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ చైనాకో, అమెరికాకో అగ్గువకు అమ్మేస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి పీజేఆర్, ఆ తరువాత తాను ఎన్నో ఏండ్లు సేవలందించామని, కానీ ప్రస్తుత నేతలు డబ్బుకు అమ్ముడుపోయి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్న విష్ణు.. రెండో జాబితాలో తనకు బదులుగా అజారుద్దీన్ పేరు రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం రాత్రి ప్రకటించారు. పీజేఆర్ వారసునికి జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ వెంటనే స్పందించింది. తెలంగాణ కోసం పోరాడిన పీజేఆర్ తనయుడిని పార్టీలోకి ఆహ్వానించి, సముచిత గౌరవాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్‌ను వీడుతున్నానని, త్వరలో అధికార బీఆర్ఎస్లో చేరుతానని విష్ణు ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం దోమలగూడలోని విష్ణువర్ధన్‌రెడ్డి నివాసానికి వెళ్లి, బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.
పీజేఆర్ గౌరవాన్ని కాపాడేలా ఆయన తనయుడు విష్ణువర్దన్‌రెడ్డికి బీఆర్ఎస్లో సముచిత స్థానాన్ని కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ అని.. సీఎల్పీ నాయకుడిగా ఆయన ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసునని అన్నారు. జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండరని, కార్మిక నాయకునిగా, పేదల పక్షపాతిగా పేదల కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు పీజేఆర్ అని కొనియాడారు. విష్ణుతో కలిసి అసెంబ్లీలో ఐదు సంవత్సరాలు పని చేశామని గుర్తు చేసుకున్నారు.
ఉద్యమం సమయంలో విష్ణు తెలంగాణ కోసం నిలబడ్డారని, పులిచింతల ప్రాజెక్టు కట్టొద్దని అసెంబ్లీలో తాము ప్లకార్డులు పట్టుకొంటే.. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి తమకు మద్దతునిచ్చారని తెలిపారు. పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు వంటి తెలంగాణ అంశాల మీద ఎప్పుడు పోరాటం జరిగినా విష్ణు యువకుడిగా, యువ శాసనసభ్యుడిగా, పీజేఆర్ వారసుడిగా తెలంగాణ కోసం నిలిచిన వారసత్వాన్ని కొనసాగించారని చెప్పారు. సీఎల్పీ పదవికే వన్నె తెచ్చిన పీజేఆర్ తనయుడికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొన్ని ముఠాల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్లను రూ.ఐదు కోట్లకు ఒకటి చొప్పున అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నాయకులే అరోపిస్తున్నారని అన్నారు. ఇట్లాంటోళ్ల చేతుల్లో రాష్ట్రం ఉంటే ఏమవుతుందో ప్రజలే ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్ కోరారు. ఆ రోజు ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ దొరికిన వ్యక్తి, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఈ రాష్ర్టానికి ఎలా న్యాయం చేస్తారో ప్రజలు ఆలోచించాలని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.