హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): మంకీపాక్స్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ వ్యాధి లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై వైద్యసిబ్బందికి అవగాహన కల్పించేందుకు సోమవారం ఆయన డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దాదాపు 60కిపైగా దేశాల్లో 12 వేల దాకా కేసులు నమోదయ్యాయని, మన దేశంలో కేరళలో మాత్రమే ఒక కేసు నమోదైందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఒక కేసు కూడా నమోదుకాలేదని, కనీసం అనుమానిత లక్షణాలతో ఉన్నవారు కూడా ఎవరూ లేరని వివరించారు. అయినప్పటికీ ఈ వ్యాధి పట్ల వైద్యారోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉన్నదని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మంకీపాక్స్ కేసుల పెరుగుదలను గమనిస్తూ, డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటిస్తున్నట్టు చెప్పారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ దవాఖానలో ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారని, పాజిటివ్ వస్తే నిర్ధారణ కోసం నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపుతారని పేర్కొన్నారు. అనుమానిత కేసులు, బాధితులకు ఎవరూ లేరని వివరించారు.అయినప్పటికీ ఈ వ్యాధి పట్ల వైద్యారోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉన్నదని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మంకీపాక్స్ కేసుల పెరుగుదలను గమనిస్తూ, డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటిస్తున్నట్టు చెప్పారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ దవాఖానలో ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారని, పాజిటివ్ వస్తే నిర్ధారణ కోసం నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపుతారని పేర్కొన్నారు. అనుమానిత కేసులు, బాధితులకు చికిత్స అందించేందుకు ఫీవర్ హాస్పిటల్‌ను నోడల్ సెంటర్‌గా ఎంపికచేసినట్టు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
మంకీపాక్స్ లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానంపై వైద్యులందరూ అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బందికీ అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానిత లక్షణాలు గుర్తించిన వెంటనే బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. సీజనల్ వ్యాధులు, మంకీపాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 040-24651119, 9030227324 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త
వర్షాలు, వరదల వల్ల రాష్ర్టంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నదని మంత్రి హరీశ్ హెచ్చరించారు. రానున్న పది రోజులపాటు అన్ని దవాఖానల్లోని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఓపీ సమయాన్ని పెంచి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని దవాఖానల్లోని సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిషరించుకోవాలని, రోగులకు మంచి వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.
తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లు 24 గంటలూ పనిచేయాలని, ఫలితాలను వీలైనంత వేగంగా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని దవాఖానల్లో రోగులకు మంచి డైట్ అందించడంతోపాటు శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని, కొత్త డైట్ మెనూను ప్రతి దవాఖానలో ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దవాఖానల్లో అందుబాటులో ఉండే మందుల సంఖ్యను 843కు పెంచుకొన్నందున బయటి మందులు రాయకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్లకు సూచించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రికాషన్ డోస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకొని 6 నెలలు దాటిన వయోజనులందరికీ బూస్టర్ డోసు అందించాలని మంత్రి హరీశ్ ఆదేశించారు.