Minister Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యాలయాల పనులను సందర్శించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ తర్వాత బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. సభకు తరలివచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు.