సిద్దిపేట, సెప్టెంబర్ 21: రాష్ట్రం నుంచి చేపలను పలు రాష్ర్టాలు, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేటలోని కోమటిచెరువులో రొయ్య పిల్లలు, చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గంగపుత్రుల పంట పండిందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని తెచ్చుకోవడం వల్ల రైతులకు సాగునీరు, మత్స్యకారులకు చేపల సంపద పెరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల చేప పిల్లలను ఉచితంగా నీటి వనరుల్లో వదు లుతున్నామని వెల్లడించారు. చేపల పెంపకంతో నేడు మత్స్యకారులు సంతోషంగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ముఖంలో చిరునవ్వు…కళ్లలో అనందం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల దీవెనలు..ప్రేమ ఉంటే రెట్టింపు ఉత్సహంతో పనిచేస్తామని చెప్పారు.
సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రా ధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యవిద్యకు తెలంగాణ ప్రాంతం దూరంగా ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 840 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, ఇప్పుడు 2,840 సీట్లకు పెంచుకున్నామని వివరించారు.