హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా లో ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తామని ఆరేండ్ల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన హామీ ఏమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. జేపీ నడ్డా 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో మర్రిగూడలో పర్యటించారు. ఆ సందర్భంగా ఫ్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ కేంద్రం కోసం తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్‌లో 8.2 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. ఆరేండ్లయినా ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్‌కు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మర్రిగూడలో 300 పడకల దవాఖాన నిర్మాణానికి కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘అబద్ధపు హామీలిస్తూ ప్రజాగోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం ముఖం పెట్టుకొని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు? ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం’ అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.