హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ):బీజేపీ నేతలు చేస్తున్న బురదజల్లుడు రాజకీయాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ బీజేపీ చేస్తున్న దాడి ఉద్దేశ పూర్వకంగా, కుట్రపూరితంగా జరుగుతున్నదని ప్రజలకు అర్థమైందన్నారు. ‘సీబీఐ త్వరలో నోటీసులు ఇస్తుందని ఢిల్లీ ఎంపీ ఎలా మాట్లాడుతారు? దర్యాప్తు సంస్థలు చేయాల్సిన ప్రకటనలను బీజేపీ నేతలు ఎలా చేస్తారు? ఇందుకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి.. సీబీఐ వాళ్లు బీజేపీ నేతలకు నేరుగా సమాచారం ఇస్తుండాలి. లేదా బీజేపీ నేతల డైరెక్షన్లోనే సీబీఐ పనిచేస్తుండాలి. మొత్తంగా నిఘా సంస్థలు, కేంద్రంలోని బీజేపీ సర్కారు కలిసి కుట్రపూరితంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నాయనేది సుస్పష్టం. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబుసంస్థలుగా మారాయి..’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీజేపీతో మంచిగుంటే వారికి అంతా నీతిమయంగా కనిపిస్తుందని, ప్రశ్నిస్తే అవినీతిమయంగా కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.