సిద్దిపేట : సీఎం కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో పట్టాభిరాముడు కొలువుదీరాడు. శ్రీరామ నవమి సందడి చింతమడకలో వారం రోజుల ముందునుంచే మొదలైంది. పట్టాభిరాముల ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం, కలశ స్థాపన కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగాయి.
శ్రీరామ నవమి రోజు పురస్కరించుకుని ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవం, శిఖర సంప్రోక్షణ, కల్యాణోత్సవంలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి మహిళలు మంగళహారతులు, కుంకుమ తిలకం దిద్దగా, గ్రామస్తులు శ్రీరామ భజనలతో కూడిన ఆధ్యాత్మికతతో వాతావరణంలో సాదరంగా ఆహ్వానించారు.
ఈ మేరకు పట్టాభిరాముల కళ్యాణోత్సవ సందర్భంగా పట్టువస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణలు చేసి సీతారామ స్వామివారికి సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించుకున్నట్లు తెలిపారు. రాముడి దీవెనలతో కలలో కూడా జరగని కాళేశ్వరం పనిని సీఎం కేసీఆర్ కృషితో చేసుకున్నామని, గ్రామంలో చెరువులు, కాల్వలు, జలకళతో నిండాయని చెప్పారు. మండు టెండలల్లో గోదావరి జలాలు పారి పరవళ్లు తొక్కుతున్నాయని, చెరువు చెల్కలు నిండి పాత రోజులు గుర్తుకొచ్చాయని వివరించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులుతో చింతలు లేని మడకగా చింతమడక గ్రామాభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలోనే శ్రీరాముల వారు కుటుంబ సమేతంగా ఉన్న ఏకశిలా విగ్రహం చింతమడకలో ఉండటం గ్రామ ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు. రూ.3 కోట్లతో శివాలయం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు జరిగేలా గ్రామస్తులు చూడాలని కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి సంప్రదాయంగా మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.