హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): అన్ని దానాల్లోకెల్ల అవయవ దానం చాలా గొప్పదని, అవయవదాన సేవలకు అవసరమైతే హెలికాప్టర్ వినియోగిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. అవయవదానంలో తెలంగాణ దేశానికి రోల్ మాడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఆర్గాన్ డొనేషన్లో దేశం సగటు 0.6 శాతం మాత్రమే ఉండగా, తెలంగాణలో 5.06 శాతం ఉన్నదని చెప్పారు. అవయవదాతలు నిజమైన హీరోలని కొనియాడారు. వారికి చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీలో అవయవ దాతల కుటుంబసభ్యులను మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒక్కో డోనర్ శరీరం నుంచి 8 రకాల అవయవదానాలు జరుగుతాయని, అవి పొందిన వాళ్లు మన మధ్య జీవించి ఉన్నారని తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఉండటం వల్ల అవయవ దానాల్లో మనం చాంపియన్‌గా నిలిచామని చెప్పారు.
రూ.35 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ బ్లాక్
గాంధీ దవాఖానలో ఆరు నెలల్లో 8వ ఫ్లోర్లో కార్పొరేట్‌కు దీటుగా రూ.35 కోట్లతో ట్రాన్స్‌ప్లాంట్ బ్లాక్ తేబోతున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆ బ్లాక్ ప్రారంభమైతే అత్యధిక సంఖ్యలో అవయవమార్పిడి సేవలు పెరుగుతాయని వివరించారు. ఉస్మానియాలో కూడా ఇటువంటి బ్లాక్ పెడతామని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ కుటుంబసభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇందుకు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్గాన్ డోనర్ కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. దాదాపు మూడు వేల మంది అవయవదానం కోసం ఎదురుచూస్తున్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని పేర్కొన్నారు.
నిర్లక్ష్యంతోనే ముప్పు..!!
చాలా మంది బీపీ, షుగర్ వచ్చినప్పుడు గుర్తించకుండావైద్య సేవలు విస్మరించడం వల్ల కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు పాడవుతున్నాయని మంత్రి తెలిపారు. చివరిగా అది ప్రాణాంతకంగా మారుతున్నదని చెప్పారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానల్లో అవయవ మార్పిడిలు అద్భుతంగా చేసిన డాక్టర్ మనీషా, డాక్టర్ మంజుషా, కిరణ్మయ్లను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి కృషి మరింతగా పెరుగాలని కోరగా.. ఆ వైద్యులు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో జీవన్‌ధాన్ నిమ్స్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, కమిషనర్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్, గాంధీ, ఉస్మానియా దవాఖానల సూపరింటెండెంట్లు డాక్టర్ రాజారావు, నాగేందర్, నిమ్స్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
అవయవదాన సేవల్లో రాష్ట్రం టాప్
రాష్ట్రంలో ఈ ఏడాది 179 మంది అవయవదానం చేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలతో పోల్చినప్పుడు మన తెలంగాణ టాప్‌లో ఉన్నదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 1,080 మంది అవయవదానం చేశారని గుర్తుచేశారు. దేశ, విదేశాల నుంచి తెలంగాణ వచ్చి అవయవదాన సేవలు పొందుతున్నారని చెప్పారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం కూడా అవయదాన సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకొన్న వారి సంఖ్య వేలల్లో ఉంటే దానం చేస్తున్న వారి సంఖ్య వందల్లో ఉన్నదని తెలిపారు. ఒకప్పుడు అవయవదాన సేవలు డబ్బున్నవాళ్లకే సాధ్యమయ్యేవని అన్నారు. కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషి వల్ల పైసా ఖర్చు లేకుండా పేదవారికి ఆరోగ్య శ్రీ ద్వారా అవయవ మార్పిడిలు చేస్తున్నట్టు తెలిపారు. జీవితకాలం నెలకు పది వేల విలువైన మందులు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ రూ.5 లక్షలతో ఉండేదని, ఈ రోజు అవయవ మార్పిడి చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నదని చెప్పారు.