రంగారెడ్డి/నాగర్‌కర్నూల్ అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక మహిళలు, వితంతువులు, వృద్ధులు, యువత, రైతులకు ఏమి చేయాలో మ్యానిఫెస్టోలో ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో విపక్షాల మాటకు విలువ లేదని, కేసీఆర్ పాలనకు తిరుగులేదని చెప్పారు. రైతులకు సీఎం కేసీఆరే చాంపియన్ అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్ఖాన్పేట్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ.176 కోట్లతో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశామని, మరో రూ.300 కోట్లతో 450 పడకల దవాఖానను నిర్మిస్తామని చెప్పారు.
ఏడాదిలోగా మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పట్టుబట్టి మెడికల్ కాలేజీని సాధించిన ఘనత సబితక్కకే దక్కుతుందని కొనియాడారు. అరవై ఏండ్ల పాలనలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణలో రెండు మెడికల్ కాలేజీలను మాత్రమే అది కూడా గులాబీ జెండా పుట్టినంకనే ఏర్పాటుచేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే 29 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని వివరించారు. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యా, ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్ వంటి దేశాలకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. అప్పట్లో సబితక్కకు 1200 ర్యాంకు వచ్చినా మెడికల్ సీటు రాలేదని, ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా మనుషుల డాక్టర్ కావాలనుకుంటే సీటు రాక పశువుల డాక్టర్ అయ్యారని ఉదహరించారు. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని, లక్షా యాభై వేల ర్యాంకు వచ్చినా సీట్లు దొరుకుతున్నాయని తెలిపారు. ఏడాదికి రూ.10 వేల ఫీజుతోనే ఎంబీబీఎస్ చదువుకొనే అవకాశం లభించిందని, ఎల్కేజీ కంటే తక్కువ ఫీజుతోనే వైద్య విద్యను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారని వివరించారు.
అభివృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో నల్లా లేని ఇల్లు, ట్రాక్టర్, పల్లెప్రకృతి వనం లేని ఊరు, డాక్టర్ లేని పీహెచ్సీ, పునరుద్ధరణ చేయని చెరువు లేదని చెప్పారు. రైతుబంధు అందని రైతు, ఆసరా పెన్షన్ అందని అవ్వా, తాత, కల్యాణలక్ష్మి అందుకోని అక్కాచెల్లెళ్లు కూడా లేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని, బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల నీళ్లు
తెలంగాణకు ఏర్పడిన తరువాత రంగారెడ్డి జిల్లాలో భూములకు విలువ పెరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయని, దాదాపు 50 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేస్తూనే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటిని మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు పారించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సబితక్క ఈసారి లక్ష పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్కొన్నారు.