సిద్దిపేట, మే 24: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో 134 రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ డయాగ్నస్ట్టిక్ హబ్ ద్వారా ప్రస్తుతం 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తుచేశారు. ఈసీజీతో పాటు 2డీ ఎకో, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, మామొగ్రఫీ సేవలను కూడా పీహెచ్సీలలో అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంగళవారం ఆయన సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో రేడియాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు 33 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌లను ఏర్పాటుచేశామని, రేడియాలజీ ల్యాబ్‌లు, మెడికల్ కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. మంచిర్యాల, రామగుండం, సంగారెడ్డి, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మెడికల్ సీట్ల సంఖ్య 700 నుంచి 2,840కు పెరిగిందని తెలిపారు. రాబోయే రెండేండ్లలో 5,280 మెడికల్ సీట్లు ప్రభుత్వ పరిధిలో ఉండేలా కృషిచేస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో ఇవన్నీ సాధ్యమవుతున్నాయని వివరించారు .
దేశంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో రేడియాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో కొత్తగా 10 రేడియాలజీ ల్యాబ్‌లను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇంతకాలం ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే పరీక్షలకు బయటకు రాస్తారనే అపవాదు ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గర్భిణులకు అల్ట్రాసౌండ్, థిపా పరీక్షను ఉచితంగా చేస్తామని అభయమిచ్చారు. గుండెపోటుకు గురైన వారికి అత్యవసర సమయంలో వైద్యం అందించి ప్రాణాలు నిలిపేందుకు స్టెమీ అనే కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోగులకు రూ.40,000 విలువ చేసే ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇస్తున్నామని వివరించారు. స్టెమీ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. గుండెనొప్పి వచ్చినప్పుడు ఈసీజీ, 2డీ ఎకో పరీక్ష చేసి, అవసరమైతే ఇంజక్షన్ వేసి, రోగిని స్టెబులైజ్ చేసి సమీపంలోని దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషిచేస్తున్నట్టు వివరించారు.