నందిగామ,ఏప్రిల్24 : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 పడకల కన్హా మెడికల్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ గురుజీ కమలేశ్ డి పటేల్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు 24 గంటలు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కన్హశాంతి వనంలో అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలతో కన్హా మెడికల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అభ్యాసకులతోపాటు చూట్టు పక్కల గ్రామాల ప్రజలకు కన్హా మెడికల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతందన్నారు. కన్హ మెడికల్ సెంటర్‌కు ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా కన్హశాంతి వనంలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటాడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం మన రాష్ట్రంలో ఉండటం మన ప్రాంతం అదృష్టమన్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితంగా మనుషులు ప్రశాంతత కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారు.
ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకుని ప్రతి రోజు ధ్యానం, యోగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కొల్లపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, కేశంపేట ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్, నందిగామ ఎంపీపీ ప్రియాంక గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, కన్హ గ్రామ సర్పంచ్ సరిత, తదితరులు పాల్గొన్నారు.