e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home తెలంగాణ బీజేపీ.. కాంగ్రెస్‌ చీకటి ఒప్పందం

బీజేపీ.. కాంగ్రెస్‌ చీకటి ఒప్పందం

  • ఢిల్లీలో కొట్లాట.. హుజూరాబాద్‌లో పొత్తట
  • ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలి
  • కేసీఆర్‌ సంపద పెంచి పేదలకు పంచుతుంటే..
  • బీజేపీ ధరలు పెంచి పేదల ఉసురు తీస్తున్నది
  • ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కొట్లాడుకునే జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మాత్రం కలిసి పనిచేయాలని చీకట్లో చేతులు కలుపుకున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆ పార్టీలను ఓడించి పుట్టగతులు లేకుండాచేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సోమవారం హుజూరాబాద్‌ మండలం కనుకులగిద్దె, జూపాక, బొత్తలపల్లి, శాలపల్లి- ఇందిరానగర్‌, రాంపూర్‌, రంగాపూర్‌, రాజాపల్లి గ్రామాల్లో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. సాయంత్రం చెల్పూర్‌లో నిర్వహించిన ధూంధాంలో ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, నాయకులు పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అనేది లేకుండా పోయిందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ అంతర్గతంగా ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల కోసం ఏమి చేసిందో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రజల కోసం ఏమి చేస్తున్నదో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గ్రహించాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో కరెంట్‌ కోసం, నీళ్ల కోసం రైతులు ఆందోళన చేయని రోజంటూ లేదని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ కష్టాలు తీరాయని చెప్పారు. 60 ఏండ్ల గోసకు సీఎం కేసీఆర్‌ చరమ గీతం పాడారని వివరించారు.

- Advertisement -

బీజేపీ బడా కంపెనీల తొత్తు
ఒక పక్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి వారి గౌరవాన్ని పెంచుతుంటే, బీజేపీ మాత్రం.. నల్ల చట్టాలను రద్దు చేయాలన్న పాపానికి రైతులపై కార్లు ఎక్కించి చంపుతున్నదని గుర్తుచేశారు. ధరలు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నదని ఆగ్రహించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ సంపద సృష్టించి పేదలకు పంచుతుంటే, రుణమాఫీ చేస్తుంటే, బీజేపీ మాత్రం బడా కంపెనీలకు ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిందని దుయ్యబట్టారు. స్వార్థం కోసం బీజేపీలో చేరిన ఈటల గెలిస్తే ఏం పనులు చేస్తారో చెప్పకుండా ఎక్కడికి వెళ్లినా తిట్లతో, అబద్ధాలతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మం త్రులతో ప్రచారం చేయించుకుంటున్న రాజేందర్‌.. పెంచిన గ్యాస్‌ ధరలు రూ.500 తగ్గిస్తామని ఒక్కరి చేతనైనా చెప్పించడం లేదని అన్నారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకుంటే తాను 15 రోజులకోసారి వచ్చి, హామీలన్నీ నెరవేర్చుతానని చెప్పారు. ఉగాది వరకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు.

అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా: గెల్లు
తాను తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని, అనేకసార్లు జైలుకు వెళ్లానని అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. పేదవాడినైన తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల ఐదేండ్ల కింద కేసీఆర్‌ 4 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా నిర్మించ లేక పోయారని మండిపడ్డారు. పైగా రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు చెప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తికి తిరిగి ఓట్లు వేయాలా.. ఆలోచించాలని కోరారు. ఈ సందర్భంగా గ్యాస్‌ సిలిండర్‌ను ప్రచార వాహనంపై ఉంచి పెరిగిన ధరల గురించి మంత్రి హరీశ్‌రావు ఊరూరా ప్రచారం చేయడం మహిళలను ఆకట్టుకున్నది.

సీఎం సభకు స్థల పరిశీలన
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాగంగా ఈ నెల 27న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించనున్న సభ కోసం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట శివారులోని పెట్రోల్‌ పంపు పక్కన స్థలాన్ని సోమవారం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ పరిశీలించారు. సభకు భారీగా వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం పెంచికల్‌పేట బస్టాండ్‌ సమీప స్థలాలను పరిశీలించారు. మంత్రి వెంట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement