చేర్యాల, జనవరి 10: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సర్పంచ్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సర్పంచ్ పదవీకాలం అంతా బోరు మోటర్లు బాగు చేయడానికే సరిపోయేదని గుర్తు చేశారు. సర్పంచ్‌లు అప్పుల పాలయ్యేవారని పేర్కొన్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ప్రారంభించి నెలనెలా టంఛన్‌గా డబ్బులు వేసి గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, సీసీ రోడ్లు నిర్మించినట్టు తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు, అధికారాలు అప్పగించి గ్రామ స్వరాజ్యానికి పాటుపడుతున్నట్టు చెప్పారు. సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని హితవుపలికారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో మంగళవారం వివిధ అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన రైతు అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో తెలంగాణ ఇప్పుడు దక్షిణ భారత ధాన్యాగారంగా మారిందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నదని విమర్శించారు. నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటూ పైశాచికానందం పొందుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పథకాలు బాగున్నాయని ఢిల్లీలో మెచ్చుకొని అవార్డులు ఇచ్చి, తెలంగాణ గల్లీలోకి వచ్చి బీజేపీ నేతలు లొల్లి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన పంటలు ఎండబెట్టుకునేందుకు సీఎం కేసీఆర్ రైతులకు కల్లాలు కట్టిస్తే, ఎందుకు కల్లాలు కట్టారని తిరిగి రూ.150 కోట్లు కేంద్రానికి కట్టాలని బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. మహారాష్ట్రలోని సర్పంచ్‌లు, కర్ణాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు ఇక్కడ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత న్యాయం జరుగుతుందని చెప్పారు.
కేసీఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి
రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మహోన్నత నేతని, ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. కరువు ప్రాంతంగా పేరున్న చేర్యాల, బచ్చన్నపేట, జనగామలో మహిళలు తాగునీటి కోసం కుండలు పట్టుకొని నీటి కోసం వెళ్లే బాధలను మిషన్ భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ పరిష్కరించినట్టు తెలిపారు. ఒకప్పటికి తెలంగాణకు ఇప్పటి తెలంగాణ తేడా చూసుకోవాలని, సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు.
గ్రామాల్లో కొందరు మూర్కులు మాట్లాడే మాటలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద యాదగిరి, మేక సంతోష్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ నాగిల్ల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.