సంగారెడ్డి, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ)/అల్లాదుర్గం/టేక్మాల్: ధరలు తగ్గాలంటే బీజేపీ వీపు పగలగొట్టాలని ప్రజలకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకొనేందుకు త్వరలోనే రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. వడ్డీ లేని రుణాలు అందిస్తామని అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో నిర్వహించిన సభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి అభయహస్తం లబ్ధిదారులకు కార్పస్ ఫండ్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభయహస్తం కింద డబ్బులు దాచుకొన్న కార్పస్ ఫండ్ డబ్బులు ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీతో సహా అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.545 కోట్లు జమ చేస్తామని అన్నారు. వడ్డీ లేని రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండగా, ప్రస్తుతం రూ.1,050కి పెంచిందని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నూనె, ఇతర నిత్యావసరాల ధరలను పెంచుకొంటూ పేదలపై మోయలేని భారం వేస్తున్నదని మండిపడ్డారు. ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని నిలదీశారు.
‘జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వరదలు వస్తే.. సైకిల్ పోతే సైకిల్, కారుకు కారు, బండికి బండి అని బండి సంజయ్ మాట్లాడిండు. వాళ్లు గెలిచేది లేదు పోయేది లేదు. ప్రజలను మోసం చేయాలని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా రూ.2 వేల పింఛను ఉన్నదా? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణలా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నరా? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా రైతుబంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నరా? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నరా? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా రూ.లక్ష కల్యాణలక్ష్మి సాయం చేస్తున్నరా? ఏమీ చేయరు. మాయమాటలు చెప్పే బట్టేబాజ్ పార్టీ.. బీజేపీ. బీజేపీ అంటేనే భారతీయ ఝూటా పార్టీ. ఎన్కట వంద అబద్ధాలు ఆడైనా ఒక పెండ్లి చేయాలన్నరు పెద్దలు. ఈ బీజేపీ మాత్రం వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలనే పార్టీ. సబ్సిడీ ఎగవెట్టిండ్రు.. సిలిండర్ రూ.1,050 చేసిండ్రు. వాళ్లకు అంబానీలు కావాలె, కార్పొరేట్ కంపెనీలు కావాలె. బ్యాంకులను మోసం చేసిన పెద్దపెద్దోళ్లకు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసిండ్రు.
పేద మహిళలు రోజూ వాడే సిలిండర్ ధర మాత్రం రూ.1,050 చేసిండ్రు’ అని మండిపడ్డారు. ధరలు పెంచే బీజేపీ ప్రభుత్వం కావాలో.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకుపోతుంటే కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని, పాదయాత్రలు, మోకాళ్ల యాత్రలు, సైకిల్‌యాత్రలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో పింఛన్ రూ.600లే ఇస్తున్నదని, ముందు అక్కడ తెలంగాణ తరహాలో రూ.2 వేల పింఛన్ ఇప్పించి ఆ తర్వాత పాదయాత్రలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం 24 గంటల విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సిజేరియన్ల ఆపరేషన్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 20 శాతం సిజేరియన్లు జరిగితే దేశంలో 60 శాతం జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకొంటున్నామని వెల్లడించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది అభయహస్తం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రంలో మహిళలకు గౌరవం పెరుగుతున్నదని అన్నారు. గతంలో ఏ పార్టీలు, ముఖ్యమంత్రులు చేపట్టని సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. కరోనా కారణంగా అభయహస్తం కార్పస్ ఫండ్ డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగిందని, ప్రస్తుతం వడ్డీతో కలిపి లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీలేని రుణాలు, స్రీ నిధి ద్వారా డబ్బులు, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇస్తున్నట్టు చెప్పారు. బ్యాంకు లింకేజీ ద్వారా ఎంత మొత్తమైనా రుణాలు అందజేస్తామని, ఆ డబ్బులతో వ్యాపారాలు చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కార్మిక కమిషన్ చైర్మన్ దేవేందర్, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దళితుల అభివృద్ధికి పెద్దపీట
దేశంలో ఎక్కడాలేని విధంగా దళితుల ఆర్థికాభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది దళిత లబ్ధిదారుల కోసం బడ్జెట్లో రూ.17,800 కోట్లు కేటాయించామని అన్నారు. దశాబ్దాలుగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దళితులకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదని చెప్పారు. ఆ పార్టీలు పాలించే రాష్ర్టాల్లో ఎక్కడా దళితబంధు లేదని, తెలంగాణలో ప్రవేశపెట్టిన దళితబంధుపై అసత్యాలు ప్రచారం చేయటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేంద్రం పరిధిలో 16 లక్షల ఖాళీలకుగానూ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేని స్థితిలో మోదీ సర్కారు ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.