నవ్వులు పూయించిన మంత్రి హరీశ్‌రావు
కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రతిపక్ష నేత,
మంత్రి హరీశ్ మధ్య ఆసక్తికర సన్నివేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొనే క్రమంలో మంత్రి వాయిలెట్ యూనిట్ వార్డుకు రాజాసింగ్‌తో కలిసి చేరుకొన్నారు. పదో తరగతి విద్యార్థి కవిత (14)తో మంత్రి ‘ఏం తల్లీ బాగున్నావా.. ఎప్పుడు వచ్చావ్.. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉన్నది’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. చిన్నప్పటి నుంచే గొంతులో స్వరపేటిక 80 శాతం మూసుకుపోయిందని, ఇప్పటికే మూడుసార్లు ఆపరేషన్ జరిగిందని యూనిట్ హెచ్‌వోడీ మంత్రికి వివరించారు. మరో రోగి తల్లిని.. ‘మందులు ఇక్కడ ఇస్తున్నారా? బయట తెచ్చుకొంటున్నారా?’ అని మంత్రి అడిగారు.
స్పందించిన బాధితురాలి తల్లి మందులు ఇక్కడే ఇస్తున్నారని, వైద్యం బాగా చేస్తున్నారని, సౌకర్యాలు బాగున్నాయని స్పష్టంచేశారు. వెంటనే మంత్రి పక్కనే ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ‘రాజా సింగ్ జీ జర సునో’ అన్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా చిరునవ్వులు చిందించారు. ‘ఈయన మమ్మల్ని అసెంబ్లీలో తిడుతుంటారు. సర్కారు దవాఖానల్లో వైద్యం బాగాలేదని, రోగులు ఇబ్బందులు పడుతున్నారని అంటుంటారు. జర నువ్వే చెప్పమ్మా’ అని మంత్రి అనడంతో రోగి తల్లి వైద్యసేవలు సూపర్‌గా ఉన్నాయంటూ సంతోషం వ్యక్తపరిచారు. ‘విన్నారా, రాజాసింగ్ జీ.. అసెంబ్లీలో మీరు మా గురించి మంచిగ చెప్పాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని మీ ముందే చెప్తున్నారు’ అని పేర్కొన్నారు. స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే నవ్వుతూ తప్పకుండా, తప్పకుండా అనుకుంటూ ముందుకు సాగారు. హరీశ్‌రావు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, కోఠి ఈఎన్టీ, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.