ఆదర్శంగా కరీంనగర్, హనుమకొండ
ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు
వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు
అధికారులతో హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : అన్ని విభాగాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. ఆదివారం అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, సీహెచ్‌వోలు, పీహెచ్సీ డాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, జ్వర సర్వే, ఇతర వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో 18 ఏండ్లకు పైబడిన వారికి రెండు డోసులు, 60 ఏండ్లకు పైబడి కోమార్బిడ్స్ ఉన్నవారికి, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రికాషన్ డోసు, 15-17 మధ్య వయస్కులకు రెండు డోసులు వందశాతం పూర్తి చేయాలని తెలిపారు. 18 ఏండ్లకు పైబడిన వారికి సంబంధించి 31 జిల్లాల్లో 100 % వ్యాక్సినేషన్ పూర్తయిందని, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ పూర్తిచేస్తే అన్ని జిల్లాల్లో లక్ష్యం పూర్తవుతుందని వెల్లడించారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే ఉన్నతాధికారులు ఆయా మండలాల్లో స్వయంగా పర్యటించి వేగం పెంచాలని ఆదేశించారు. ఓవైపు కరోనా వైద్యసేవలు అందిస్తూనే.. మరోవైపు సాధారణ వైద్య సేవలు, ఎన్సీడీ స్రీనింగ్, నమూనాల సేకరణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయంటూ సర్వేలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సర్వేకు అనుబంధంగా కొవిడ్ ఓపీని కొనసాగించాలని సూచించారు. కొవిడ్ అనుమానితుల సంఖ్య ఎక్కువుంటే అవసరమైతే రెండో, మూడో విడత సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు.
హనుమకొండ, కరీంనగర్‌కు ప్రత్యేక అభినందనలు
హనుమకొండ, కరీంనగర్ జిల్లాల అధికారులు, సిబ్బందిని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ రెండు జిల్లాల్లో 18 ఏండ్లకు పైబడిన వారికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తికాగా, 15-17 ఏండ్ల క్యాటగిరీలో హనుమకొండ 100 శాతం పూర్తి చేసి మొదటి జిల్లాగా నిలిచింది. ఇతర జిల్లాలు ఈ రెండు జిల్లాలను స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సుధీర, కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
డిశ్చార్జిలే అధికం
1,217 మందికి పాజిటివ్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్రంలో ఆదివారం కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉన్నది. కొత్తగా 1,217 మందికి వైరస్ సోకినట్టు నమోదైంది. 3,994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26 వేలకు దిగొచ్చింది. పాజిటివిటీ రేటు సైతం 2.5 శాతానికి తగ్గింది. కరోనా, ఇతర కారణాల వల్ల ఒకరు మరణించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 383, రంగారెడ్డిలో 103, మేడ్చల్ మల్కాజిగిరిలో 99 కేసులు నమోదయ్యాయి.
76 వేలమందికి టీకాలు
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 76 వేల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 105 శాతం మందికి మొదటి డోస్, 88 శాతం మందికి రెండో డోస్ పూర్తయింది. 15-18 ఏండ్ల మధ్య వయసు వారికి 72 శాతం టీకాల పంపిణీ పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8.95 లక్షల డోసులు, ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 53,494 పడకలు అందుబాటులో ఉన్నాయి.