ఏటా రాష్ట్రంలో 93 వేల యూనిట్ల రక్తం కొరత 
రక్తదానాన్ని ప్రోత్సహించాలి: మంత్రి హరీశ్‌రావు
రక్తదానం చేసిన ఎంపీ సంతోష్‌కుమార్
శిబిరాలు నిర్వహించిన ఎమ్మెల్యేలకు సన్మానం
బన్సీలాల్‌పేట్, జూన్ 14: ‘అన్నదానంతో ఒక పూట ఆకలి తీర్చవచ్చు. విద్య అందిస్తే జ్ఞానం పంచవచ్చు. కానీ రక్తదానంతో ప్రాణదాత కావొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. రక్తదానాన్ని ప్రోత్సహించాలి’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ గాంధీ వైద్యకళాశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు దాతలతో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల యూనిట్ల రక్తం అవసరమవుతున్నదని, ఏడాదికి మూడు లక్షల ఏడు వేల యూనిట్లను దాతలు స్వచ్ఛందంగా అందిస్తున్నారని, 93 వేల యూనిట్ల రక్తం కొరత ఏర్పడుతున్నదని చెప్పారు.
ప్రతి వ్యక్తిలో ఐదు లీటర్ల రక్తం ఉంటుందని, కేవలం మూడు వందల మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే రక్తదానంలో తీసుకొంటారని చెప్పారు. ప్రాణాపాయ సమయంలో రక్తాన్ని దానం చేసినవారు దేవుడితో సమానమని అన్నారు. తలసేమియా, హీమోఫిలియా బాధితులకు, రోడ్డు ప్రమాదాలు, ప్రసవాల సమయంలో ఎక్కువగా రక్తం అవసరమవుతున్నదని పేర్కొన్నారు. గాంధీ దవాఖానలో మాదిరిగా రక్తాన్ని వేరుచేసి ఇవ్వడానికి వీలుగా ప్రత్యేక యంత్రాలను అన్ని జిల్లాలలో ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో రక్తదానం చేయాలని, అది నిరుపేద రోగులకే అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, కార్పొరేటర్లు కే హేమలత, సామల హేమ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి డైరెక్టర్ ప్రీతిమీనా, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తదితరులు పాల్గొన్నారు.
 
 
రక్తదానాన్ని ప్రోత్సహించిన ఎమ్మెల్యేలకు సన్మానం
రక్తదానం చేయటంతోపాటు ఈ ఏడాదిలో అధికంగా రక్తదానం చేసేలా ప్రోత్సహించి, రక్తదాన శిబిరాలను నిర్వహించిన నలుగురు ఎమ్మెల్యేలను హరీశ్‌రావు అభినందించారు. వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తన పుట్టినరోజుల్లో, మిగతా సందర్భాల్లో గత 18 ఏండ్లుగా అనేక క్యాంపులు పెట్టి 2,600 యూనిట్లు సేకరించారని చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి 7,600 యూనిట్లు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 7,100 యూనిట్లు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 3,550 యూనిట్ల రక్తం సేకరించి ప్రభుత్వ దవాఖానలకు అందజేశారని తెలిపారు. దాత నటరాజ్ 157 సార్లు రక్తదానం చేయడాన్ని స్వాగతించారు. నలుగురు ఎమ్మెల్యేలను, ఇతర దాతలను, బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను శాలువాతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం స్వచ్ఛందంగా రక్తదానం చేస్తామని సభకు హాజరైన వారంతా ప్రతిజ్ఞ చేశారు.