ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 7: తెలంగాణలో తక్కువ ర్యాంక్ వచ్చిన వారికి కూడా డాక్టర్ సీటు దొరుకుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్ వర్సిటీ అనుబంధ సంస్థ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, యూనివర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రైవేట్ వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పడిన మొదటి మెడికల్ కళాశాల నీలిమ కాలేజీ అని పేర్కొన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నందున ఇతర రాష్ర్టాల విద్యార్థులు ఇక్కడి వైద్య కళాశాలల్లో చేరుతున్నారని చెప్పారు.
ఎక్కువ ఎంబీబీఎస్ ఇక్కడే..
దేశంలో ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని, ప్రతి లక్ష మందికి 22 మంది వైద్యులు తయారవుతున్నారని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. నీలిమ మెడికల్ కళాశాల నిర్మాణం, ఆధునిక పరికరాలు, ఫ్యాకల్టీల ఏర్పాటు చాలాబాగుందని ప్రశంసించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశానికి సరిపడా డాక్టర్లను అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలతోపాటు మంచి విద్యనందించి ఉత్తమ డాక్టర్లుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్‌రెడ్డి, అనురాగ్ వర్సిటీ సీఈవో సూర్యదేవర నీలిమ, వైస్‌చాన్స్‌లర్ రామచంద్రం, అడ్మిన్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.