హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. 10వేలకు పైగా కొత్త ఉద్యోగులను నియమించగా.. 22 మంది వేల ఆర్టిజన్లను క్రమబద్ధీకరించినట్లు చెప్పారు. టీఎస్ఎస్పీడీసీఎల్ల్లో నూతనంగా నియమితులైన 48 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు (ఏఈ) మింట్ కాంపౌండ్‌లోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్తు సంస్థలకు వినియోగదారులే యజమానులని, వారి పట్ల పాజిటివ్ దృక్పథంతో మెలగాలని సూచించారు. విద్యుత్తు సంస్థలో నూతనంగా చేరేవారికి సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డిలే రోల్‌మాడల్ అని మంత్రి ఉద్బోధించారు. 50 ఏండ్లు ఒకే సంస్థలో పనిచేసిన రికార్డ్ ప్రభాకర్‌రావు సొంతమని కొనియాడారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సైతం విద్యుత్తు సంస్థను ఇల్లుగా, పనిచేసే సిబ్బందిని కుటుంబంగా భావించి సంస్థను గొప్పగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. 12వేల మంది ఏఈ పరీక్షరాస్తే 48 మంది మాత్రమే ఎంపికయ్యారని, ఎస్పీడీసీఎల్లో ఉద్యోగం సాధించిన వారంతా అదృష్టవంతులని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ గౌరవరం రఘుమారెడ్డి, డైరెక్టర్లు జే శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, మదన్మోహన్రావు, గోపాల్, పర్వతం, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
10% ఫలితం.. ఐదుగురు ఎస్టీలకు జాబ్
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో తొలిసారిగా 10శాతం ఎస్టీ కోటా కేటాయించారు. దీంతో ఎస్టీ కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. పాత రిజర్వేషన్ ప్రకారం 48 మందిలో ముగ్గురు మాత్రమే ఎంపిక కావాలి. 10శాతానికి పెంచడంతో ఐదుగురు ఏఈలుగా నియమితులయ్యారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
మాది వనపర్తి జిల్లా. ఎస్టీ కోటాలో 10శాతం రిజర్వేషన్ అమలుచేయడంతో నేను ప్రభుత్వ ఉద్యోగినయ్యా. ఏఈగా ఎంపికై నియామకపత్రం తీసుకున్నా. ఎస్టీ రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచడంతో మేం ఫలాలు అందుకోగలుగుతున్నాం. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– కే భగవంత్
అంకితభావంతో పనిచేస్తా
మాది హైదరాబాద్. బీటెక్ ఎలక్ట్రికల్ పూర్తిచేసిన తర్వాత ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నం చేశా. వాటిని దక్కించుకోలేకపోయా. ఎస్టీ రిజర్వేషన్‌ను పెంచడంతో పోస్టుల సంఖ్య పెరిగి, ఉద్యోగాలు దక్కుతున్నాయి. రిజర్వేషన్లు పెంచి మాకు న్యాయం చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. అంకితభావంతో పనిచేసి సంస్థ అవసరాలు, వినియోగదారుల ఆకాంక్షలను నెరవేరుస్తా.
-వంశిక