కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 12: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మనలాంటి ఒక్క పథకమైనా ఉందా..? చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి మరింత వేగంగా సాగాలన్న, మరింతగా అభివృద్ధి సాధించాలన్నా.. బీఆర్ అండగా ఉండాలని ప్రజలకు సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 34వ డివిజన్ రూ.76.75 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు, 50వ డివిజన్ ఆలయ స్వాగత తోరణం పనులకు, హౌసింగ్ కాలనీలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం జడ్పీ కార్యాలయంలో సీఈఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు 268 మందికి రూ.2.68 కోట్ల విలువైన చెక్కులు అందించారు. అనంతరం 108 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రెగ్యులరైజ్ ప్రొసీడింగ్స్ అందజేశారు.
అనంతరం మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులతో కలిసి కలెక్టరేట్ సమీక్ష నిర్వహించారు. అలాగే రేకుర్తిలోని బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని ప్రారంభించారు. సాయంత్రం మెడికల్ కళాశాలలో సాగుతున్న వివిధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వారి మాటలు నమ్మి అధికారం అందిస్తే తెలంగాణలోని సంపదను దోచుకుని తెలంగాణను గుడ్డిదీపం చేస్తారని విమర్శించారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ తాగునీరు, కరెంట్ కోసం కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో పాటుగా, 24 గంటలు నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే తాము పని చేస్తున్నామని, వచ్చే ఏడాదిలోగా మానేరు రివర్ ఫ్రంట్ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న బీఆర్ సీఎం కేసీఆర్ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన పలువురు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ మండల శాఖ ఉపాధ్యక్షుడు రాపోలు పవన్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మేయర్ సునీల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నగర బీఆర్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు