కరీంనగర్ : తిరుమలలో ఉన్న టీటీడీ((TTD) దేవస్థానం మాదిరిగానే కరీంనగర్లో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కరీంనగర్లో ఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం పై టీటీడీ క్షేత్ర ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర టీటీడీ అధికారులతో కలిసి మంత్రి ఆదివారం కరీంనగర్లో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఆలయాన్ని సంవత్సరంన్నరలోగా పూర్తిచేసి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సోమవారం భూకర్షణంతో ఆలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేయనున్నామని, ఈనెల 31వ తేదీన ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామని వెల్లడించారు.అదే రోజు సాయంత్రం శ్రీవారి కల్యాణాన్ని(Srivari Kalyanam) అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. పండగ వాతావరణం లో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అందరూ నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ‘ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని’ కోరారు. ఆలయం మొత్తం రాతి కట్టడంతో ఉంటుందని,ఈ రాయిని తమిళనాడు(Tamilnadu) నుంచి తీసుకువస్తామన్నారు. కలియుగంలో భక్తులను రక్షించేందుకే తిరుమలలో శ్రీవారు వెలిశారని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. స్వామి వారి అనుగ్రహం ఉండటం వల్లే కరీంనగర్ లో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయని వెల్లడించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం మిథున లగ్నంలో భూకర్షణం చేసిన పనులకు అంకురార్పణ చేయనున్నామన్నారు.
31 వ తేదీన ఉదయం 6 గంటలకు ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమై 7 గంటల 20 నిమిషాలకు ముగుస్తుందన్నారు. తిరుమల తిరుపతి క్షేత్రంలో స్వామి వారికి ఎలాంటి కైంకర్యాలైతే చేపడుతారో అలాంటి సేవలను కరీంనగర్ శ్రీవారి ఆలయంలో చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లాహరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.