కరీంనగర్ : విద్యార్థులకు చదువుతో పాటు రోజు వారి జీవితంలో క్రీడలు కూడా భాగం కావాలని..శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉంటే..నేడు స్వరాష్ట్రంలో 337 పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఉన్న కళాశాలలో పాటు మరో 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోందని, కష్టపడి చదివి తల్లి దండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానకొండుర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ గోపి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎం.జే.పీ స్కూల్స్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ప్రిన్సిపల్ విమల తదితరులు పాల్గొన్నారు.